కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల ‘విజయ’ కేతనం

Updated on: May 03, 2026 | 2:41 PM

నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి ఫలితాల్లో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోవని నిరూపిస్తూ, విద్యార్థులు రికార్డు మార్కులు సాధించారు. దేవిక జిల్లా టాపర్‌గా నిలవగా, 65 మంది 500+ మార్కులు పొందారు. ఉపాధ్యాయుల నిబద్ధత, ప్రభుత్వ ప్రణాళికల అమలుతో నాణ్యమైన విద్య సాధ్యమని ఈ విజయం చాటింది.

ప్రభుత్వ పాఠశాల అంటే చులకన భావం ఉన్న కాలం చెల్లిపోయింది. నిబద్ధత గల ఉపాధ్యాయులు, క్రమశిక్షణ గల విద్యార్థులు తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని విశాఖ జిల్లాలోని నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరూపించారు. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఈ పాఠశాల విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో సత్తా చాటారు. కేవలం పాస్ మార్కులతో సరిపెట్టుకోకుండా, కార్పొరేట్ సంస్థలు అసూయపడే రీతిలో నడుపూరు విద్యార్థులు మార్కులు కొల్లగొట్టారు. దేవిక అనే బాలిక 592 మార్కులతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే టాపర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. అలాగే 27 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారు. మొత్తం 65 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని దశదిశలా చాటారు. తమ విద్యార్థుల అద్భుత ప్రతిభ చూసి ఉపాధ్యాయులు మురిసిపోయారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. కార్లు, వాహనాలు ఏర్పాటు చేసి, భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులతో విద్యార్థుల ప్రతిభను ఊరంతా చాటుతూ వారు చేసిన ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకర్షించింది. ప్రభుత్వ స్కూళ్లలోనూ నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని ఈ విజయం ద్వారా వారు సమాజానికి బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ విజయం వెనుక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాచకొండ శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషి దాగి ఉంది. ప్రభుత్వ 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ స్కూల్ పనితీరు స్పష్టంగా కనిపిస్తోంది.2022లో ఇక్కడ చదివిన వారిలో 11 మంది విద్యార్ధులు 500+ మార్కులతో పాసయ్యారు. 2024 లో 37 మంది, ఈ ఏడాది 65 మంది విద్యార్ధులు అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తాచాటారు. కేవలం బట్టీ పట్టించే చదువులకు స్వస్తి చెప్పి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు పట్టుదలతో చదివి విజేతలుగా నిలిచారు. “పిల్లలకు కాస్త ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారు” అని నడుపూరు ఉపాధ్యాయులు గర్వంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాల విజయం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జనగణన యాప్ లో భద్రాచలం.. ఏపీలో ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోంది

ఫ్యామిలీ డెత్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ??

మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట

ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి

RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??

Follow Us