పైన చూస్తే కోళ్ల ఫామ్‌లు..లోపల దందా మాత్రం వేరే..

|

Jan 16, 2025 | 5:05 PM

కోళ్ల దాణా ముసుగులో అల్ఫ్రాజోలం దందా సాగిస్తున్న నిందితులను పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. పౌల్ట్రీ వ్యాపారం ముసుగులో అల్ఫ్రాజోలం ఉత్పత్తి...ప్రకాశం జిల్లా కేంద్రంగా సాగుతున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడితో పాటు.. మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి.. వారి నుంచి రూ.55 లక్షల విలువైన అల్ఫ్రాజోలం సీజ్ చేశారు. అల్ఫ్రాజోలం తయారీ పరిశ్రమలో సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఆంధప్రదేశ్‌లో మూతపడిన కోళ్ల ఫారాల్లో రహస్యంగా అతి భయంకరమైన మత్తు మందుగా పరిగణించే నిషేదిత అల్ఫ్రాజోలంను, తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అధికారులు గుర్తించారు. అద్దంకి నుంచి వస్తున్న మారుతి కారును నిలిపి తనిఖీలు చేశారు. కారులో 700 గ్రాముల అల్ఫ్రాజోలం సీజ్ చేశారు. దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం ఉమామహేశ్వరం ప్రాంతంలో ఉన్న కోళ్ల ఫారాల్లో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో నిందితుడు చెప్పాడు. అతడు చెప్పిన వివరాలతో మిర్యాలగూడ ఎక్సైజ్‌ పోలీసులు రాజుగారి చెరువుల దగ్గర ఉన్న కోళ్ల ఫారాల్లో అల్ఫ్రాజోలం తయారీ పరికరాలు, 4.67 కేజీల అల్ఫ్రాజోలం పట్టుకున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పలువురికి అమ్ముతున్నట్లు నిందితుడు వెల్లడించాడు.