భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త.. కట్ చేస్తే సీన్ రివర్స్

Updated on: Jan 10, 2026 | 4:21 PM

భార్య వంట చేయలేదని, ఇంటి పనులు చూడలేదని భర్త కోరిన విడాకులను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఇద్దరూ ఉద్యోగస్థులైనప్పుడు వంట చేయకపోవడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధునిక కాలంలో బాధ్యతలను పరస్పర అవగాహనతో పంచుకోవాలని హితవు పలికిన హైకోర్టు తీర్పు, వివాహ సంబంధాలపై నూతన చర్చకు దారితీసింది.

రాను రాను వివాహబంధానికి విలువ లేకుండా పోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకూ వెళ్లిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య వంటచేయడంలేదని, ఇంటిపనులు చేయడంలేదని తనకు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కాడు. అయితే ఈ కారణాలను క్రూరత్వంగా పరిగణించలేమని పిటిషన్‌ను తిరస్కరించింది హైకోర్టు. ఈ ఘటన తెలంగాణలో జరిగింది. హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య ఇంటి పనులు, వంట చేయకుండా, తన తల్లికి సాయపడకుండా మానసికంగా హింసిస్తోందని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురవడంతో హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, దంపతులిద్దరి పనివేళలను పరిశీలించింది. భర్త మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 గంటల వరకు, భార్య ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించింది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, ఇంటి పనుల విషయంలో ఆరోపణలు చేయడం సహేతుకం కాదని అభిప్రాయపడింది. భార్య వంట చేయడం లేదనో, ఇంటి పనులు చక్కబెట్టడం లేదనో విడాకులు మంజూరు చేయలేమని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైనప్పుడు, కేవలం వంట చేయలేదనే కారణాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ తీర్పు ఇస్తున్నట్లు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా గర్భస్రావం తర్వాత కోలుకోవడానికి భార్య పుట్టింటికి వెళ్లడాన్ని క్రూరత్వంగా భావించలేమని స్పష్టం చేసింది. భర్త ఆరోపణల్లో వైవాహిక బంధాన్ని రద్దు చేసేంత తీవ్రమైన కారణాలు లేవని తేల్చిచెప్పిన హైకోర్టు, అతని అప్పీలును కొట్టివేసింది. ఆధునిక కాలంలో బాధ్యతలను పాతకాలపు ధోరణులతో కాకుండా పరస్పర అవగాహనతో పంచుకోవాలని హితవు పలికింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ టికెట్ల జారీ రద్దు

మీరు ట్రైన్ ట్రైన్ మిస్సైతే.. అదే టికెట్‌తో వేరే రైలు ఎక్కోచ్చా

దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు

Trump: గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేసిన ట్రంప్

Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు ట్రైలర్.. పక్కా పండగ బొమ్మ