వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలితీవ్రత తగ్గింది. డిసెంబరు ప్రారంభం నుంచే రాష్ట్ర ప్రజలను గజగజా వణికించిన చలి తీవ్రత ఒక్కసారిగా తగ్గిపోయింది. సాధారణంగా శివరాత్రి వరకు కొనసాగాల్సిన చలి ఈసారి సంక్రాంతికి ముందే చలో అంది. ఎముకలు కొరికే చలిగాలుల స్థానంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలకు చలి నుంచి ఉపశమనం లభించినట్లయింది.
రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 31 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు మళ్లీ ఫ్యాన్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ‘కోల్డ్‌వేవ్ 2.0’ ముగిసిందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. వచ్చే వారం పది రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని, తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని అధికారులు వివరించారు. మరోవైపు, ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌లో వాతావరణం స్వల్పంగా మారనుంది. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోని బీదర్ సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రాత్రి వేళల్లో చలి తీవ్రత కొంత ఉన్నప్పటికీ, పగటి పూట మాత్రం సాధారణ వేడి కొనసాగనుందన్నారు. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పగటిపూట పొడి వాతావరణం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల మధ్యాహ్న సమయాల్లో ఎండ ప్రభావం కొంత అధికంగా అనిపించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :