దారం లేని పతంగ్‌ చూసారా? ఎలా ఎగురుతుందంటే..

Updated on: Jan 15, 2026 | 12:41 PM

గాలిపటాల కోసం ఉపయోగించే మాంజా.. మనుషులతోపాటు పక్షులకూ ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ క్రమంలో గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు.. అతడి మిత్ర బృందంతో కలిసి దారం అవసరం లేని గాలిపటాన్ని సృష్టించాడు. ఇది ఎగరడానికి గాలి కూడా అవసరం లేదట. అదే ‘రిమోట్‌ కంట్రోల్‌ పతంగి’. సూరత్‌కు చెందిన విక్కీ వఖారియా.. రిమోట్‌తో పని చేసే గాలి పటాన్ని రూపొందించాడు.

ఇది గాల్లో గింగిరాలు కూడా తిరుగుతుంది. రాత్రి సమయాల్లో రంగురంగుల ఎల్‌ఈడీ లైట్లతో వెలుగులను విరజిమ్ముతుంది. దీనిని భారత్‌లో అంతర్జాతీయ పతంగుల వేడుకతో పాటు ఇండోనేసియా, సింగపూర్‌, చైనాల్లోనూ విక్కీ బృందం ప్రదర్శించి బహుమతులు గెలుచుకుంది. ప్రధాని మోదీని కలిసి ఈ సాంకేతికతను వివరించే అవకాశం వీరికి దక్కింది.మాంజా వల్ల ఏటా మనుషులు, పక్షులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తననెంతో బాధించాయని, అందుకే దారంలేని పతంగిని రూపొందించినట్లు విక్కీ తెలిపాడు. నాలుగు డిజైన్లలో మొత్తం 15 గాలిపటాలు తయారు చేశానని, ఒక్కోదానికి రూ.40 వేల నుంచి రూ.45వేల వరకు ఖర్చయిందన్నాడు. మకర సంక్రాంతి పండుగను వివిధ పేర్లు, వివిధ సంప్రదాయాలతో దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటారు. సంక్రాంతి అంటేనే గాలిపటాల సందడి గుర్తొస్తుంది. తులసీదాస్ రచించిన రామచరిత మానస్‌ ప్రకారం, శ్రీరాముడు మకర సంక్రాంతి రోజున మొదటిసారిగా గాలిపటం ఎగురవేశారని చెబుతారు. ఆ గాలిపటం చాలా ఎత్తుకు వెళ్లి ఇంద్రలోకానికి చేరిందని నమ్మకం. అప్పటి నుంచి సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా మారిందని హిందువుల విశ్వసిస్తారు.