కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో వరుడు జంప్ వీడియో

Updated on: Aug 15, 2025 | 6:52 PM

మరికొన్ని గంటల్లో మూడు ముళ్లు వేయాల్సిన ఆ వరుడు.. ఉన్నట్టుండి పెళ్లిమండపం నుంచి మాయమయ్యాడు. దీంతో కంగారు పడిన వధువు కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. అతగాడికి ఆల్రెడీ పెళ్లయిందని, మొదటి భార్యతో కలిసి.. పెళ్లి మండపం నుంచి పారిపోయాడని తెలుసుకుని వారంతా షాకయ్యారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలుకి చెందిన పాలి సత్యనారాయణకు గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. వీరికి ఆగస్ట్‌ 11 సోమవారం తెల్లవారుజామున వివాహం జరిపేందుకు ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. పెళ్లి పనులు అన్నీ పూర్తయి.. వరుడి కుటుంబం,బంధువులు.. వధువు ఇంట పెళ్లికి తరలివచ్చారు. మరికాసేపట్లోనే పెళ్లి తంతు మొదలు కావాల్సి ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. ఈ వార్త పెళ్లింట దావానంలా పాకటంతో.. అందరూ కలిసి అతడికోసం వెతుకులాట ప్రారంభించారు. ఎంతకూ పెళ్లికొడుకు కనిపించకపోయే సరికి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల విచారణలో అసలు సంగతి తెలుసుకుని పెళ్లికి వచ్చిన వారంతా నోరెళ్లబెట్టారు. కాగా, సత్యనారాయణకు ఐదేళ్ల క్రితమే.. ఓ వితంతువుతో వివాహం జరిగిందని తేలింది. పెళ్లి నాటికే.. ఆ మహిళకు పెళ్లీడుకొచ్చిన ఒక కూతురు ఉందని, ఆ యువతికీ సత్యనారాయణే వివాహం జరిపించాడని కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం దాచిపెట్టి.. రెండో పెళ్ళికి సత్యనారాయణ రెడీ అయ్యాడని, అయితే.. ఈ పెళ్లి సంగతి తెలుసుకున్న సత్యనారాయణ భార్య .. కేసు పెడతానంటూ బెదిరించటంతో.. భయంతో అతడు పారిపోయాడని వధువు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వధువుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రేమంటే ఇదే..చనిపోయిన తోడును లేపుతున్న పక్షి..కన్నీరు పెట్టిస్తున్న వీడియో

21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉందో చూశారా?

అతి పెద్ద గుహలో చిన్న ప్రపంచం..వీడియో చూస్తే మతిపోవాల్సిందే గురూ!