బంగారం వదిలేసి కొత్త బాట పట్టిన తమిళనాడు స్మగ్లర్లు

Updated on: Aug 30, 2025 | 1:18 PM

స్మగ్లర్స్‌ రూటు మార్చారు. ఇప్పటి వరకూ బంగారం, డ్రగ్స్‌ అక్రమ రవాణా చేసిన కేటుగాళ్లు ఇప్పడు కొత్త దందా మొదలు పెట్టారు. తమిళనాడు స్మగ్లింగ్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మారుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. డ్రగ్స్, బంగారం వంటి అక్రమ రవాణాకు అడ్డాగా మారిన ఈ రాష్ట్రంలో ఇప్పుడు సరికొత్త దందా వెలుగులోకి వచ్చింది.

స్మగ్లర్లు ఇప్పుడు బంగారం కన్నా ఎక్కువ లాభదాయకంగా, తక్కువ రిస్క్‌తో కూడిన డ్రోన్ల స్మగ్లింగ్‌పై దృష్టి సారించారు. ఈ ఏడాది చెన్నై ఎయిర్ కస్టమ్స్ అధికారులు ఏకంగా 200 డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటి విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. బంగారం స్మగ్లింగ్‌పై కస్టమ్స్ అధికారులు ఉక్కుపాదం మోపడంతో స్మగ్లర్లు రూటు మార్చారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన నిఘా పెరగడంతో బంగారం అక్రమ రవాణా కష్టతరంగా మారడంతో డ్రోన్లు, వన్యప్రాణులు, ఇ-సిగరెట్ల స్మగ్లింగ్‌పై ఫోకస్‌ చేస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ల స్మగ్లింగ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలో 2020లో 9 డ్రోన్లు పట్టుబడగా, 2024 నాటికి ఆ సంఖ్య 200కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ డీజేఐ కంపెనీ డ్రోన్లను విడిభాగాలుగా చేసి, వాటిని ‘ఎలక్ట్రానిక్స్’ పేరుతో చెక్-ఇన్ బ్యాగేజీలో పెట్టి అక్రమంగా తరలిస్తున్నారు. సింగపూర్, మలేషియా, యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులను ఇందుకోసం వినియోగించుకుంటున్నారు. భారత్‌లో డ్రోన్ల దిగుమతిపై 2022లోనే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. కేవలం పరిశోధన, భద్రతా అవసరాలకు మాత్రమే మినహాయింపు ఉంది. ఈ నిబంధనలను ఆసరాగా చేసుకుని స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. మరోవైపు, డ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ కూడా యథేచ్ఛగా సాగుతోంది. గంజాయి వంటి మాదకద్రవ్యాలను మణిపూర్ నుంచి రైళ్లలో తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రామనాథపురం జిల్లాలోని కీళకరై, తూత్తుకుడి రేవుల ద్వారా శ్రీలంకకు, ఆపై ఆస్ట్రేలియాకు పంపుతున్నారు. మెథామ్‌ఫెటమిన్, గంజాయి వంటివి ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల నుంచి కూడా తమిళనాడుకు చేరుతున్నట్లు దర్యాప్తులో తేలింది. భద్రతా లోపాలు, అనువైన రవాణా మార్గాల కారణంగా తమిళనాడు స్మగ్లర్లకు స్వర్గధామంగా మారిందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. సూర్యరశ్మితో ఇంధనం తయారీ!

సెల్ఫీ డెత్‌ రేటింగ్‌లో ఇండియా టాప్‌

ఆ పత్రిక పేరునే.. తెలుగుదేశం పార్టీకి పెట్టారా?

ఐఫోన్‌ తయారీలో కుప్పం ముద్ర

హైదరాబాద్‌లో బీచ్.. సముద్ర తీరాన్ని తలదన్నేలా ఏర్పాట్లు