సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

Updated on: Jan 17, 2026 | 9:26 AM

సంక్రాంతి పండుగ కోసం పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ మహా నగరం జన సంచారం లేకుండా నిర్మానుష్యంగా మారింది. ముచ్చటైన మూడు రోజుల సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకొని తిరుగు ముఖం పడుతున్నారు నగర వాసులు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుండి విజయవాడ వైపు మూడు రోజుల్లో మూడు లక్షల వాహనాలు వెళ్లాయి. పండుగ సంబరం పూర్తి కావడంతో తిరుగు ముఖం పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ – విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఎన్ హెచ్ 65పై పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టింది. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహన దారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు నాగార్జునసాగర్, పెద్దవూర, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్‌కు రీచ్‌ అవ్వాలి. నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మర్రిగూడ బై పాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటే సులభంగా ఉంటుంది. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి నుంచి మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని పోలీసులు సూచించారు.