ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..

Updated on: Jan 18, 2026 | 8:48 AM

సంక్రాంతికి కోడి పందేలు ఎంత ఫేమస్సో ముగ్గుల పోటీలు కూడా అంతే ఫేమస్‌. సంక్రాంతి వస్తుందంటే కొత్త కొత్త రంగవల్లులు నేర్చుకుని ఇంటిముందు పెద్ద పెద్ద ముగ్గులు తీర్చిదిద్దుతారు మహిళలు. అంతేనా.. ఎవరి ఇంటిముందు ముగ్గు పెద్దగా ఉంది, ఎవరి ముగ్గు బావుంది అని చెక్ చేస్తారు. అందుకే ఒకరికొకరు పోటీపడి మరీ ముగ్గులు వేస్తారు. అలాంటిది ముగ్గుల పోటీలు పెట్టి.. అందులో పాల్గొన్న వారందరికీ పట్టుచీరలు కానుకగా ఇస్తామంటే మహిళామణులు ఆగుతారా.. ఇంట్లో బీరువా నిండా చీరలున్నా.. ముగ్గు గిన్నె పట్టుకొని పోటీకి వెళ్లిపోరూ.. సరిగ్గా అదే జరిగింది...భద్రాద్రి జిల్లాలో.

భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు వీరాభిమాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని రంగు రంగుల రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు. తెలుగు ప్రజలకు పెద్ద పండగైన సంక్రాంతి.. హరిదాసులు, భోగి మంటలు, చెరకు గడలు, పాడిపంటలతో కళకళలాడింది. ఇక తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కొత్తపల్లి వారి సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ పట్టు చీరలను బహూకరించారు నిర్వాహకులు. పండగవేళ తాము గెలుచుకున్న పట్టుచీరలు చూసుకొని తెగ మురిసిపోయారు మహిళలు.