ప్రకృతిలో మరో అద్భుతం.. రాఖీపుష్పం ఎప్పుడైనా చూశారా ??
రక్షాబంధన్..! అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. దక్షిణాది రాష్ట్రాల్లో రాఖీ పండుగను రాఖీ పౌర్ణమి అంటారు. శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున తోబుట్టువుల మధ్య అనుబంధం ఆప్యాయతల పండుగ ఇది. కుల మతాలకతీతంగా రాఖి సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే.. మార్కెట్లో చాలా రకాల రాఖీలు అందుబాటులో ఉంటాయి.
పది రూపాయల నుంచి వందలు వేల రూపాయల్లో కూడా రాఖీ ఉంటుంది. వెండి, బంగారం తో కూడిన రాఖీలు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. అయితే.. పర్యావరణ ప్రేమికుల కోసం ఈ సీజన్లో ప్రత్యేకంగా ఓ రాఖి ఆకర్షిస్తోంది. రాఖీ లాంటి పుష్పం ఇప్పుడు ప్రకృతి ప్రేమికులకు తెగ నచ్చేస్తుంది. ఇదిగో చూశారా రాఖీ ఫ్లవర్. దీన్నే కృష్ణ కమల్ అని కూడా అంటారు. శాస్త్రీయ నామం పాసీ ఫ్లోరా. దీన్నే ఫ్యాషన్ ఫ్లవర్.. రక్షాబంధన్ ఫ్లవర్.. ఫ్రెండ్షిప్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం విశాఖలోని మొక్క జాతుల విజ్ఞాన భాండాగరంగా పేరుపొందిన బయోడైవర్సిటీ పార్కులో ఈ పుష్పం విరబూసింది. రాణి చంద్రమదేవి ఆసుపత్రి ప్రాంగణంలో.. మూడు ఎకరాల విస్తీర్ణంలో ఈ బయోడైవర్సిటీ పార్క్ రూపుదిద్దుకుంది. గత 24 ఏళ్లుగా ఇక్కడ వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ రామమూర్తి. ఇక్కడ రకరకాల ఫల, పుష్ప, ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. చిన్న మొక్క నుంచి భారీ వృక్షాల వరకు ఈ ఉద్యానవనంలో ఒకే చోట కనిపిస్తాయి. ఎడారి మొక్కలు సైతం ఇక్కడ దర్శనమిస్తాయి. ఎంతోమంది విద్యార్థులకు ఇక్కడ మొక్కలు విజ్ఞానాన్ని అందించాయి. ఈ బయోడైవర్సిటీ పార్కులో రాఖీ ఫ్లవర్ ఇప్పుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. శ్రావణ మాసంలోనే ఈ పుష్పాలు విరబూస్తుంటాయి. రాఖీని పోలిన ఈ పుష్పాలు ప్రకృతి ప్రేమికులకు పండగ పూట తెగ నచ్చేస్తుంటాయి. ఇక్కడకు ప్రత్యేకంగా ఈ పూలను చూసేందుకు క్యూ కడుతుంటారు. ఈ పూలతో ఎంచక్కా ఫోటోలు తీసుకుంటూ.. ఈ పూల విశేషాలను తెలుసుకుంటున్నారు. కొంతమంది చేతికి పెట్టుకొని ప్రకృతి సృష్టించిన రాఖిని చూసి తెగ మురిసిపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. బాలిక ప్రాణం తీసిన సాలీడు
టైర్ పంక్చర్ మోసంపై అలర్ట్! అదేంటంటే
నాగబంధనం వేసిన గదిని తెరిచేది ఎప్పుడు? అనంత పద్మనాభ ఆలయ గది రహస్యం ఏంటి!