కళకు హద్దుల్లేవ్.. నా మనసులో ద్వేషం లేదు

Updated on: Nov 21, 2025 | 11:12 AM

నేపాల్‌లోని ఓ సంగీత కచేరీలో పాకిస్థానీ రాపర్ తల్హా అంజుమ్ భారత జాతీయ పతాకాన్ని భుజాలపై కప్పుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ చర్యపై పాకిస్థాన్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, తల్హా అంజుమ్ తన కళకు సరిహద్దులు లేవని ఘాటుగా స్పందించారు. భారత రాపర్ నేజీతో అతనికున్న వైరం కూడా ఈ వివాదానికి దారితీసింది. ఈ సంఘటన ఇరు దేశాల సంగీత ప్రియుల మధ్య చర్చనీయాంశమైంది.

నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన ఓ సంగీత కచేరీలో పాకిస్థానీ రాపర్ తల్హా అంజుమ్ భారత జాతీయ పతాకాన్ని భుజాలపై కప్పుకోవటం వివాదానికి దారితీసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పాకిస్థాన్‌లో తల్హాపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. దీంతో అతడు స్పందించిన తీరు.. మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. అసలేం జరిగిందంటే.. కచేరీలో తల్హా అంజుమ్ ప్రదర్శన ఇస్తుండగా, ప్రేక్షకుల వైపు నుంచి ఒకరు భారత జెండాను వేదికపైకి విసిరారు. ఆ సమయంలో అంజుమ్.. భారత గల్లీ గ్యాంగ్ రాపర్ నేజీని ఉద్దేశించి కంపోజ్‌ చేసిన ట్రాక్‌ను ప్రదర్శిస్తున్నాడు. అతడు వెంటనే వేదిక మీద పడిన త్రివర్ణ పతాకాన్ని తీసుకుని..దాన్ని ఉత్సాహంగా గాలిలో ఊపి, ఆ తర్వాత తన భుజాలపై కప్పుకున్నాడు. వైరల్‌ అయిన వీడియోపై పాకిస్థానీ నెటిజన్లు మండిపడ్డారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో తల్హా తీరు బాగాలేదని వారంతా తమ పోస్టుల్లో విమర్శించారు. కాగా, తనపై వస్తున్న విమర్శల పట్ల తల్హా అంజుమ్ ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించాడు. “నా హృదయంలో ద్వేషానికి చోటు లేదు. నా కళకు సరిహద్దులు లేవు. నేను భారత జెండాను ఎగరేయడం వివాదాన్ని రేపితే, అలాగే కానివ్వండి. నేను మళ్లీ అదే పని చేస్తాను. ప్రచారం కోసం పడిచచ్చే మీడియాను, యుద్ధాన్ని కోరుకునే ప్రభుత్వాలను నేనెప్పటికీ పట్టించుకోను. ఉర్దూ ర్యాప్ ఎప్పుడూ సరిహద్దులు లేనిదిగా ఉంటుంది” అని పోస్టులో రాసుకొచ్చారు. భారత రాపర్ నేజీ, తల్హా అంజుమ్ మధ్య 2024లో వివాదం మొదలైంది. పాకిస్థానీ కళాకారులతో కలిసి పనిచేయడం గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో అడిగిన ప్రశ్నకు నేజీ.. “కౌన్ తల్హా?” అని వ్యాఖ్యానించారు. దీన్ని అవమానంగా భావించిన తల్హా , దక్షిణాసియా ర్యాప్ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుతూ నేజీని లక్ష్యంగా చేసుకుని డిస్ ట్రాక్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వివాదం రెండు దేశాల సంగీత ప్రియుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూరగాయలతో పోటీ పడుతున్న గుడ్డు ధర

చిట్టీలు కట్టించుకుని మోసం చేసిన మహిళ.. బాధితులు ఏం చేశారంటే

చిన్నారి చేసిన పనికి చలించిపోయిన దొంగ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే ??

ఉచితగా AI కోర్స్ ఈ విధంగా నేర్చుకోండి.. జీవితంలో సెటిల్ అవ్వండి