కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
నవీ ముంబైలోని ఓ ఆటో డ్రైవర్ అద్భుతమైన నిజాయితీని చాటారు. తన ఆటోలో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆయన వెంటనే తిరిగి అప్పగించారు. రివార్డును సున్నితంగా తిరస్కరించి, నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ గొప్ప పనికి పోలీసులు ఆయన్ను సన్మానించారు. ఇది నిజంగా స్ఫూర్తిదాయకమైన కథ.
లక్షల్లో విలువ చేసే నగలు దొరికినా.. వాటిని ఏమాత్రం ఆశ పడకుండా తన నిజాయితీని నిరూపించుకున్నాడు నవీ ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్. తన ఆటో ఎక్కిన ఓ ప్రయాణికుడు అందులోనే బ్యాగు మర్చిపోయి దిగిపోయాడు. ఆటో డ్రైవర్ అందులో ఏముందోనని తెరిచి చూడగా.. బంగారు నగలు కనిపించాయి. దీంతో అతడు షాక్ అయ్యాడు. ప్రయాణికుడు దాన్ని మర్చిపోయాడని గుర్తించాడు. సాధారణంగా అయితే బంగారం ధరలు ఎక్కువవుతున్న ఈ సమయంలో ఆ నగలు తానే తీసుకుని లైఫ్‌లో సెటిల్ కావాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ఆటో డ్రైవర్ అలా అనుకోలేదు. ఆ బ్యాగును ప్రయాణికుడు అందజేయాలనుకున్నాడు. వెంటనే అతడి దిగిన చోటుకెళ్లి అతడిని కనుక్కుని మరీ 16 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను ఇచ్చేశాడు. నవీ ముంబైలోని వాషికి చెందిన ఒక మహిళ.. భక్తుల బృందంతో కలిసి కాశీ యాత్ర పూర్తి చేసుకుని గురువారం వాషి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే ఆమెను తీసుకువెళ్లడానికి కుమారుడు మోతీలగ్ వచ్చాడు. వీరిద్దరూ కలిసి సంతోష్ శిర్కే అనే నడిపే ఆటోలో ఎక్కారు. వారిద్దరినీ దింపి వెనక్కి వచ్చే క్రమంలో ఆమె బ్యాగ్ ఆటోలోనే ఉందని సంతోష్ గుర్తించాడు. అదే సమయంలో.. తల్లి బ్యాగు.. ఆటోలోనే ఉండిపోయిందని మహిళ కుమారుడు మోతీలగ్ గుర్తించాడు. వెంటనే.. ఆ విషయాన్ని తన ఆటో డ్రైవర్ స్నేహితుడికి చెప్పగా.. ఆ స్నేహితుడు వెంటనే ఈ విషయాన్ని ఆటో రిక్షా డ్రైవర్ల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. ఈలోగానే ఆటో డ్రైవర్ సంతోష్ శిర్కే ఆ బ్యాగ్‌ను తీసుకొని వాషి రైల్వే స్టేషన్ సమీపంలోని ఆటోరిక్షా యూనియన్ కార్యాలయంలో డిపాజిట్ చేసినట్లు తెలిసింది. వెంటనే మోతీలగ్ యూనియన్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారు బ్యాగ్‌ను తీసుకుని వాషి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఏపీఐ రవీంద్ర నరోటే సమక్షంలో.. ఆటో డ్రైవర్ శిర్కే ప్రయాణికుడిని గుర్తించారు. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తికాగానే.. నగల బ్యాగ్‌ను పోలీసులు అసలు యజమానికి అప్పగించారు. శిర్కే నిజాయితీని పొగడటానికి మాటలు చాలడం లేదని మోతీలగ్ పోలీసులకు తెలిపారు. 120 గ్రాముల బరువున్న ఆ బంగారు ఆభరణాలు తమ కష్టార్జితం అని, కృతజ్ఞతగా శిర్కేకు నగదు రివార్డు ఇవ్వజూపగా.. ఆయన సున్నితంగా దాన్ని తిరస్కరించినట్లు ప్రయాణికుడు తెలిపారు. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను నా విధిని మాత్రమే నిర్వర్తించాను అని శిర్కే చెప్పడం.. ధన వ్యామోహం కంటే నైతిక విలువలే ముఖ్యమని రుజువు చేసింది. డ్రైవర్ సంతోష్ శిర్కేను పోలీసులు స్టేషన్లోనే సన్మానించి అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమలలో అంబానీ కిచెన్.. నిత్యం 2 లక్షల మందికి సరిపడేలా వంటశాల
ఫుట్‌పాత్‌పై పాలమ్మే వ్యక్తి కూతురు.. వరల్డ్ ఛాంపియన్
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
