సునీతా విలియమ్స్ మిషన్‌లో తప్పిన పెను ప్రమాదం : నాసా నివేదికలో షాకింగ్ నిజాలు!
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ప్రయాణించిన 'స్టార్‌లైనర్' మిషన్‌పై నాసా విడుదల చేసిన 311 పేజీల విచారణ నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మిషన్‌ను అత్యంత ప్రమాదకరమైన 'టైప్-ఏ మిషాప్'గా నాసా వర్గీకరించింది. గతంలో 2003లో కల్పనా చావ్లా ప్రాణాలు కోల్పోయిన 'కొలంబియా షటిల్' విపత్తును కూడా నాసా ఇదే కేటగిరీలో చేర్చడం గమనార్హం.
కేవలం 8 రోజుల పర్యటన కోసం 2024 జూన్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు సాంకేతిక లోపాల వల్ల ఏకంగా 286 రోజులు అక్కడే చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 19న విడుదల చేసిన 311 పేజీల నివేదికలో నాసా ఈ వైఫల్యానికి గల కారణాలను వివరించింది. ప్రొపల్షన్ వ్యవస్థలో వైఫల్యం, ఐదు థ్రస్టర్లు పనిచేయకపోవడం, అలాగే హీలియం లీకేజీలు వంటి తీవ్రమైన సాంకేతిక లోపాలను గుర్తించింది. అంతేకాకుండా, భద్రతా హెచ్చరికలను పెడచెవిన పెట్టి, మిషన్‌ను గడువులోగా పూర్తి చేయాలనే ఒత్తిడితో అధికారులు ముందుకు సాగడం పెను తప్పిదమని నివేదిక స్పష్టం చేసింది.కల్పనా చావ్లా ప్రమాదం సమయంలో ఇంజనీర్ల సూచనలను అధికారులు ఎలాగైతే బేఖాతరు చేశారో, స్టార్‌లైనర్ విషయంలోనూ అదే ‘కల్చరల్ బ్రేక్‌డౌన్’ పునరావృతమైందని విచారణ కమిటీ తేల్చింది. అదృష్టవశాత్తూ, ప్రాణనష్టం జరగకపోయినా 200 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. చివరకు వీరు 2025 మార్చి 18న స్పేస్‌ఎక్స్ (SpaceX) నౌక ద్వారా సురక్షితంగా భూమికి చేరారు. ఈ సుదీర్ఘ ప్రయాణంతో సునీతా విలియమ్స్ తన కెరీర్‌లో మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపి సరికొత్త రికార్డు సృష్టించారు.
మరిన్ని వీడియోల కోసం :