నాగపంచమి వేళ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

Updated on: Oct 27, 2025 | 7:58 PM

దేశవ్యాప్తంగా కార్తీకమాసం శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కార్తీక మాసం అంటేనే పండుగలు వరుసకడతాయి. అక్టోబరు 25న నాగుల చవితి రోజు భక్తులంతా పాముపుట్టల వద్ద చేరి నాగేంద్రుని రూపంలో పాములకు పాలు పోసి పూజలు నిర్వహించారు.

మర్నాడు నాగపంచమి పేరుతో కొన్ని ప్రాంతాల్లో నాగదేవతను ఆరాధించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. నాగుల చవితిరోజు నాగుపాము పుట్టలోంచి బయటకు వచ్చి పాలు సేవిస్తే.. నాగపంచమి రోజు శివాలయంలో శివలింగంపై నాగుప్రత్యక్షమై భక్తులకు కనువిందు చేసింది. నాగుల చవితి రోజున శ్రీకాకుళం జిల్లా పలాస మండలం శాసనంలో భక్తులు పుట్ట వద్ద పూజలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ నాగు పాము పుట్టలోంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చింది.అంతేకాదు పుట్ట వద్ద మట్టి పాత్రలో భక్తులు వేసిన పాలను పాము తాగటంతో భక్తులంతా ఆశ్చర్యపోయారు. నాగదేవత తమను కరుణించిందని ఆనందంలో మునిగిపోయారు. ఈ ఘటన మరువక ముందే మర్నాడు ఆదివారం నాగపంచమి వేళ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణి వీధిలో మరో అద్భుతo జరిగింది. ఓ భారీ నాగు పాము ఆలయ గర్భ గుడిలోని శివలింగం పై దర్శనమిచ్చింది. పరమ శివునికి మెడలో నాగాభరణమైనట్టు శివలింగాన్ని చుట్టుకుని పగడ విప్పి బుసలు కొడుతూ దర్శనం ఇచ్చింది. అప్పటికే శివలింగం పై స్వామివారికి అలంకారంగా ఉంచిన నాగ పడగకు అనుబంధంగా పాము చుట్టుకొని ఈ ఆభరణమెందుకు నా స్వామికోసం నేనుండగా అన్నట్టుగా పగడ విప్పి శివలింగానికి చుట్టుకొని దర్శనమిచ్చింది. శివలింగానికి చుట్టుకొని ఉన్న పామును చూసి భయపడిన అర్చకుడు దూరంనుంచే పూజలు నిర్వహించారు. అయినా పాము ఏమాత్రం అక్కడినుంచి కదలలేదు. అది స్వయంగా స్వామివారి మహిమేనని భావించిన అర్చకులు పూజలు పూర్తిచేసి బయటకు వచ్చారు. ఈ విషయం తెలిసి స్థానిక భక్తులు ఆలయానికి పోటెత్తారు. నాగాభరణభూషితుడైన పరమేశ్వరుని దర్శించుకుని తరించారు. అనంతరం అర్చకులు స్థానిక స్నేక్‌ క్యాచర్‌కు సమాచార మివ్వడంతో అతను వచ్చి పామును బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అంతా మనసులోనే నాగేంద్రునికి నమస్కరించారు. నాగ పంచమి పర్వదినం రోజున ఈ ఘటన జరగటంతో భక్తులు దీనిని మహిమగా చెప్పుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రైవేట్ బస్సులంటేనే హడల్‌.. ఆర్టీసీకి పెరిగిన ఆదరణ

అన్నం కోసం వస్తే.. ప్రాణమే పోయింది

Shreyas Iyer: ICUలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్‌ అయ్యర్‌

వైట్‌హౌస్‌లో కూల్చివేతలు.. జనం మాట పట్టించుకోని ట్రంప్

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరో యాక్సిడెంట్