అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!

Updated on: Nov 15, 2025 | 12:45 PM

మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన రూ. 3 లక్షల విలువైన పత్తి పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైంది. ఇంటి వద్ద ఆరబెట్టిన పత్తి అగ్నికి ఆహుతి కావడంతో రైతు కుటుంబం రోడ్డున పడింది. ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నా, విద్యుత్ ప్రమాదంతో సర్వం కోల్పోయిన రైతు శంకర్ ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ఆరుగాల కష్టపడి పండించిన పంట చేతికొచ్చినట్టే వచ్చి బుగ్గిపాలైంది. పొలం నుంచి తీసుకొచ్చి ఇంటిముందు ఆరబెట్టిన పత్తి చూస్తుండగానే కాలి బూడిదైపోయింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పత్తి మొత్తం నిమిషాల వ్యవధిలోనే అగ్నికి ఆహుతైపోయింది. తేమశాతం తగ్గించడం కోసం తెల్లబంగారాన్ని ఆరబెట్టిన ఆ రైతుకు చివరకు బూడిద మిగిలింది. కళ్లముందే ఆ రైతు కుటుంబం రెక్కల కష్టం అంతా కాలి బూడిదైంది. ఆ సమయంలో ఆ రైతు తల్లి రోదనలు అందరిని కలిచివేశాయి. ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఇంటికి చేర్చినా.. చివరకు విద్యుత్ ప్రమాదం రూపంలో విపత్తు వెంటాడింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం రామ‌చంద్రుతండాలో జరిగింది. బాదావ‌త్ శంక‌ర్ అనే రైతు త‌న పొలంలో వేసిన ప‌త్తిని తెంపి ఇంటికి తీసుకొచ్చాడు. మార్కెట్ కు వెళితే తేమ సాకుతో ఇబ్బందులు పెడతారని ఇంటి ముందు ఆర‌బెట్టాడు. ఆ పత్తి వద్ద రైతు తల్లి కాపలాగా కూర్చుంది. ఇంతలోనే అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్‌తో ఆ ప‌త్తికి మంట‌లు అంటుకున్నాయి. క్ష‌ణాల్లోనే ప‌త్తి అంతా కాలి బూడిదైంది. ప‌త్తికి కాప‌లాగా ఉన్న ఆ మ‌హిళ గ‌ట్టిగా కేక‌లు వేయ‌గా ఇరుగుపొరుగు వారు వ‌చ్చి మంట‌ల‌ను ఆర్పేందుకు య‌త్నించారు. కానీ అప్ప‌టికే ప‌త్తి పూర్తిగా దగ్ధ‌మై బూడిద మిగిలింది . రైతు ఇంటి వ‌ద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ప్ర‌మాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. సుమారు రూ. 3 ల‌క్ష‌ల వరకు పంట న‌ష్టం జ‌రిగింద‌ని రైతు శంక‌ర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఇంటికి చేర్చిన రెక్కల కష్టం ఇలా కాలి బూడిదవడంతో రైతు కుటుంబం అంతా కంటతడి పెట్టుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సబ్‌ రిజిస్ట్రార్‌కే కుచ్చు టోపీ పెట్టారుగా

180 కి.మీ స్పీడ్‌లో ‘వందేభారత్‌’ .. తొణకని గ్లాసులో నీరు

Karnataka Farmers: చెరుకు రైతుల అసహనం.. రోడ్డుపై బీభత్సం

రష్మికకు పబ్లిక్‌లోనే ముద్దుపెట్టేసిన రౌడీ హీరో

కిలో ఉల్లి ఒక్క రూపాయి మాత్రమే.. ఎక్కడంటే