Sweets: ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! ఆకట్టుకుంటూ నోరూరిస్తున్న స్వీట్స్‌..

|

Dec 02, 2024 | 6:15 PM

రోలు, రోకలి, తిరగలి, సన్నికల్లు.. కుండ, కూజా... ఇవన్నీ పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఉండే వస్తువులు. పండుగ సమయాల్లో పది రోజుల ముందునుంచే పనులు ప్రారంభించేవారు. పిండివంటలకు అవసరమైన పిండిని రోళ్లలో దంచేవారు. ఆవకాయ సీజన్‌ వచ్చిందంటే నెలరోజుల ముందు నుంచే అవరసరమైన కారం వగైరా దంచి పెట్టుకునేవారు.

రాను రాను ఇవి కనుమరుగైపోయాయి. యాంత్రీకరణ పెరిగిపోవడంతో ఇప్పుడు అవేవీ పల్లెటూర్లలో సైతం కనిపించడంలేదు. చివరికి పిండి వంటలు తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలే పిండి వంటలుగా మారిపోయాయి. ప్రస్తుతం ఈ పరికరాలను స్వీట్స్‌గా తయారు చేసి ఫంక్షన్స్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా సప్లై చేస్తున్నారు కొందరు దుకాణదారులు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లోని ఓ దుకాణంలో వీటిని స్పెషల్ గా తయారుచేసి విక్రయిస్తున్నారు. వాటికోసం స్థానికులు ముందుగా ఆర్డర్ ఇచ్చి మరి చేయించుకుంటున్నారు. సాధారణంగా బెల్లం పానకంతో తయారుచేసిన మరమరాలు ఉండ అందరూ చిన్నతనంలో టేస్ట్ చేసే ఉంటారు. ఇప్పుడు అదే ఫార్ములాతో బెల్లం, మరమరాలు కలిపి రోలు-రోకలి, రుబ్బురోలు-పొత్రం, తిరగలి, కుండ, సన్నికల్లు వంటి పరికరాలను తినుబండారాల రూపంలో అచ్చు వేసి, పెద్ద పెద్ద సైజులలో తయారు చేస్తున్నారు.

అలా తయారైన బెల్లం మరమరాల తినుబండారాలను స్థానికులు పండుగ సమయాలలో దేవతామూర్తులకు నైవేద్యంగా అర్పించి అనంతరం వాటిని ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ఇక మరికొందరైతే ఆడపిల్లలకు పెట్టే సారెలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా వీటిని పెడుతున్నారు. ఈ వంటకాల కోసం స్వీట్ షాప్ లకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించి వాటిని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, యాపిల్‌, సీతాఫలం, సపోటా, అరటిపండు ఇలా రకరకాల పండ్లను కూడా స్వీట్స్‌ రూపంలో తయారు చేసి విక్రయిస్తున్నారు. చెట్టున పండిన పండ్లను మించి ఆకర్షిస్తున్నాయి ఈ స్వీట్లు. పాలకొల్లులో స్వీట్ షాప్ ల వద్ద ప్రస్తుతం ఇలాంటి బెల్లం మరమరాల పరికరాలు దర్శనమిస్తున్నాయి. ఆనాడు ఇంటి పనులకోసం ఉపయోగించిన వస్తువులను ఇలా మళ్లీ గుర్తు చేసుకోవడమే కాకుండా మన పల్లె సంస్కృతిని తరతరాలకు చాటి చెప్పేలా వాటిని చూపించగలుగుతున్నామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.