డబ్బుల కోసం పోస్టాఫీసుకి పోతే.. పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా వీడియో
కష్టపడి సంపాదించుకుని పొదుపు చేసుకున్న సొమ్ము ఎవరో అప్పనంగా కొట్టేశారంటే ఎవరికైనా ఎలా ఉంటుంది? తమ చాలీచాలని సంపాదనలో కూడా రూపాయి రూపాయి కూడబెట్టి భవిష్యత్ అవసరాలకు దాచుకున్న ఆ కూలీ డబ్బులనూ.. ప్రభుత్వ ఉద్యోగులే దిగమింగారంటే ఎలా అర్ధం చేసుకోవాలి. ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య, వితంతు పింఛన్లలో కొంత మిగుల్చుకొని వైద్య ఖర్చుల కోసం కొందరు, తమ పిల్లల భవిష్యత్ కోసం మరికొందరు నెలనెలా పోస్టాఫీసులో పొదుపు చేస్తూ వచ్చిన సొమ్ము.. ఒక్కసారిగా మాయమైపోతే.. ఆ బడుగు జీవుల గుండెలు జారిపోవూ.. బాపట్ల జిల్లాలో ఓ పోస్టాఫీస్‌లో డబ్బులు దాచుకున్న వారి ప్రస్తుత పరిస్థితి ఇదే. జనం సొమ్ముకు కాపలా కాయాల్సిన వారే.. దానిని దిగమింగితే.. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారంతా లబోదిబోమంటున్నారు. పొదుపర్లకు చేయూత అందించాల్సిన పోస్టుమాస్టర్ ఖాతాదారులను నమ్మించి నట్టేట ముంచేశాడని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పూనూరు పోస్టాఫీసులో 22 ఏళ్లుగా కల్యాణ్ రావు పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో అందరితో సత్సంబంధాలున్న ఆయన.. తన బ్రాంచ్‌లో 1200 మంది చేత పొదుపు ఖాతాలు తెరిపించాడు. పోస్టుమాస్టర్ పథకాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వటంతో జనం.. తమ కొచ్చే నెలవారీ పించన్ల నుంచి నెలనెలా కొంత సొమ్మును పొదుపు చేసుకుంటున్నారు. అయితే, గడువు ముగిసినా.. పోస్ట్ మాస్టర్ తమకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వటం లేదంటూ.. ఏప్రిల్ 15న ఆ గ్రామంలో కొందరు ఖాతాదారులు.. చీరాల పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న పూనూరులో తనిఖీలు చేసిన శ్రీనివాసరావు.. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. అయితే, శ్రీనివాసరావు తప్పుడు నివేదిక ఇచ్చారంటూ కొందరు మోసపోయిన ఖాతాదారులు విజయవాడలోని పోస్టాఫీస్ ప్రధాన కార్యాలయంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో, ఉన్నతాధికారులు మే 22న పూనూరు పోస్టాఫీస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేయటంతో పోస్టుమాస్టర్ అవినీతి బట్టబయలైంది. దీంతో, కల్యాణ్ రావును కాపాడేందుకు తప్పుడు నివేదిక ఇచ్చిన చీరాల పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావును హిందుపురం బదిలీ చేయటంతో బాటు దొంగ సంతకాలతో నగదు డ్రా చేసిన పూనూరు పోస్టుమాస్టర్‌ను సస్పెండ్ చేశారు. పూనూరు పోస్టాఫీస్ బ్రాంచ్ కార్యాలయ పరిధిలో 50 లక్షలకు పైగా ఖాతాదారులను మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం :
పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో