అమెరికాలో డెలివరీకి తొందర పడుతున్న మహిళలు.. ఎందుకంటే?

అమెరికాలో డెలివరీకి తొందర పడుతున్న మహిళలు.. ఎందుకంటే?

Samatha J

|

Updated on: Jan 24, 2025 | 3:10 PM

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో విదేశీయులంతా తెగ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా విదేశీ గర్భిణీ స్త్రీలు అయితే.. ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. తమకు నెలల నిండకపోయినా సరే ఆపరేషన్లు చేసైనా డెలివరీ చేయాలంటూ వైద్యులను కోరుతున్నారు. దాని వల్ల తల్లీబిడ్డలు ఇద్దరికీ ప్రమాదం అని తెలిసినా లెక్కచేయకుండా.. సీ సెక్షన్లు చేయించుకోవాలని అనుకుంటున్నారు. 7 నెలల గర్భిణీ స్త్రీలు కూడా సిజేరియన్లు చేయాలంటూ ఆస్పత్రులకు ఎందుకు వెళ్తున్నారు, వారికి అంత కష్టం ఏమొచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి.. జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు డొనాల్డ్ ట్రంప్.

అయితే పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే.. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా విదేశాల నుంచి అక్రమంగా వలసలు వచ్చి ఉంటున్న వారికి బిడ్డలు పుడితే.. వారికి తమ దేశ పౌరసత్వం ఇవ్వమని తేల్చి చెప్పారు. దీంతో విదేశీ ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏం చేయాలో పాలుపోక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికే గర్భం దాల్చిన పలువురు విదేశీ మహిళలు.. జన్మతః పౌరసత్వం రద్దు గడువు తేదీలోగానే పిల్లల్ని కంటే తమ బిడ్డలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుందని ఆశ పడుతున్నారు. ఇందుకోసమే గర్భం దాల్చి 6 నెలల నిండిన వాళ్లంతా ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 20వ తేదీ లోపే ఈ డెలివరీలు చేయాలని కోరుతున్నారట. 8, 9 నెలల నిండిన వారికి సీ సెక్షన్లు చేస్తే పెద్దగా ప్రమాదం లేకపోయినా.. 6, 7 నెలల వారికి సిజేరియన్లు చేయడం మంచిది కాదని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

Published on: Jan 24, 2025 02:34 PM