కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
ఆ కళ్లజోడు ఎదురుగా ఉన్న వ్యక్తులు, వస్తువులను ఇట్టే గుర్తుపట్టేస్తుంది. చూపులేనివారికి అక్షరాలు కూడా చదివి వినిపిస్తుంది. అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఏఐ ఆధారిత కళ్లజోడు రోడ్డుకు అడ్డుగా పడిన వస్తువును కూడా ముందుగానే గుర్తించి అదేమిటో చూపులేని వారికి చెప్పేస్తుంది. రోడ్డుమీద ప్రయాణించే వాహనాలు, సిగ్నల్స్, అక్కడ వచ్చే ప్రదేశాలు.. ఇలా ప్రతి దాని గురించి ముందుగానే వారికి వివరిస్తుంది. ఆ మార్గంలో పాటించాల్సిన జాగ్రత్తలతో బాటు, బ్రెయిలీ కీ గురించి కూడా సూచనలు జారీ చేస్తుంది. కెమెరాలు, సెన్సార్లతో.. జీపీఎస్ ఆధారంగా నేవిగేషన్ అందించటం ఈ ఏఐ కళ్ల జోడు ప్రత్యేకత.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, బొల్లినేని సోదరుల చేతుల మీదుగా ఈ ఏఐ టెక్నాలజీ కళ్లజోళ్లను అంధులకు అందజేశారు. వీటిని కేఎఫ్‌ఆర్‌సీ- అచల హెల్త్ సర్వీసెస్ ఉమ్మడి ప్రాజెక్టు కింద ఏపీలోని అంధులకు ఉచితంగా అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అంధుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఏఐ సాయంతో బొల్లినేని సొదరులు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. పుట్టుగుడ్డి, పాక్షిక అంధత్వంతో బాధపడేవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కళ్లద్దాలు అందించడం వరమని మంత్రి ప్రశంసించారు. ఎదురుగా ఉండే వ్యక్తులు, వస్తువులు, ప్రదేశాలను గుర్తించి తెలియజేయడం, పత్రికలు చదివి వినిపించడం, ఫోన్‌లోని మెసేజ్‌లను వివరించేలా రూపొందిన ఈ ఆధునిక కళ్లజోళ్లను జిల్లావాసులకు ఉచితంగా అందజేయడం బొల్లినేని బ్రదర్స్ గొప్ప మనసుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన 220 మంది చూపులేని వారికి మంత్రి ఆనం చేతులమీదుగా ఏఐ కళ్లద్దాలు అందజేశారు.
మరిన్ని వీడియోల కోసం :
