దహాడీ వేడుకల్లో.. వాతల వైద్యం ఒక్క చురుకుతో.. ఏ రోగమైనా పరార్

Updated on: Oct 25, 2025 | 8:33 AM

భారతదేశం భిన్న సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలకు నెలవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం పాటిస్తారు. గిరిజనులు, ఆదివాసీలు పాటించే ఆచారాలు గురించి చెప్పనక్కర్లేదు. వారి సంప్రదాయాలు కఠినంగా, విచిత్రంగా ఉంటాయి. అలాంటి విచిత్రమైన ఆచారం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ కొందరు మూఢవిశ్వాసాలను వీడటం లేదు.

అంతుచిక్కని ఎన్నో రోగాలను టెక్నాలజీ ద్వారా గుర్తించడమే కాకుండా.. అద్భుతమైన చికిత్సను సైతం అందిస్తున్నా ఈ రోజుల్లో కూడా నాటు వైద్యాన్నే అనుసరిస్తున్నారు గిరిజనులు. ఒక్క వాతతో ఎలాంటి రోగమైనా నయమైపోతుందంటున్నారు అదిలాబాద్‌ అడవి బిడ్డలు. అదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీలు దీపావళి వెళ్లిన మర్నాడు దండారీ పండుగ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇనుప చువ్వలను నిప్పుల్లో ఎర్రగా కాల్చి, గుస్సాడీలు అని పిలిచే ఓ ప్రత్యేక తెగకు చెందిన వారితో వాతలు పెట్టించుకుంటారు. ఈ కార్యక్రమాన్ని దహాడీ పేరుతో పెద్ద వేడుకగా నిర్వహిస్తారు. గుస్సాడీల చేత ఇలా వాతలు పెట్టించుకుంటే ఎంతటి మొండి రోగం అయినా మటుమాయం అవుతుందని, రోగాలు రావని ఆదివాసీలు నమ్ముతారు. ఏడు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకల్లో చివరిరోజు దహాడీ వేడుకను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా, మనుషులతో పాటు పశువులకు సైతం ఎర్రని చువ్వను‌ కాల్చి వాతలు పెట్టడం దహాడీ ప్రత్యేకం. దీపావళి వేళ.. తరతరాలుగా ఈ ఆచారాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నామని ఆదివాసీలు తెలిపారు. ఈ వేడుకకు వినియోగించే ఇనుప చువ్వలను అమావాస్య, గ్రహణ సమయాల్లో కమ్మరుల వద్ద ప్రత్యేకంగా తయారు చేయించి, భద్రంగా దాచిపెడతారు. ఇనుప చువ్వను‌ వేడి చేసేందుకు సైతం ప్రత్యేకమైన పిడకలను , కర్రలను వాడుతారు. పోలాల అమావాస్య రోజు సేకరించిన కర్రలను , పొరకను ఉపయోగించి దహాడీ వేళ ఇనుప చువ్వను కాలుస్తారు. అలా కాల్చిన చువ్వతో గుస్సాడీ తెగవారు మెడపై వాత పెడ్తారు. చంటి పిల్లల నుండి వృద్దుల వరకు ఈ వాతలు పెట్టించుకుంటారు. అలా చేస్తే ఊరికి ఎలాంటి కీడు జరగదని వారు నమ్ముతారు. ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా సైతం తమను ఏమీ చేయలేకపోయిందని, అందుకు కారణం ఈ వాతల వైద్యమేనని అంటున్నారు. దహాడీ ముగియగానే మరుసటి రోజు కొలబోడి కార్యక్రమం నిర్వహించి దండారీ వేడుకను ముగిస్తారు ఆదివాసీలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’

‘అరడజను’ పిల్లలతో సంతోషంగా ఉండు బావా !! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్

2025 లో నాగుల చవితి ఎప్పుడు.. వివరాల కోసం ఈ వీడియో చూసేయండి

అహ్మదాబాద్ సీన్ రిపీట్.. టేకాఫ్ కాగానే.. కూలిన విమానం

అప్పుగా పెట్రోల్‌ పోయలేదని.. పొట్టు పొట్టు కొట్టిన ఖాకీ