Mahbubnagar : కూతురు బతికుండగానే పిండంపెట్టిన తండ్రి..కారణం తెలిస్తే షాకే..!(వీడియో)

|

Feb 04, 2022 | 9:40 AM

బతికున్న కూతురికి ఓ తండ్రి పిండం పెట్టిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తమకు ఇష్టం లేని వివాహం చేసుకుందన్న కోపంతో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

కన్నకూతురు బతికుండగానే దినకర్మ జరిపించి, పిండం పెట్టాడో తండ్రి. ఊరంతా కూతురు చనిపోయిందంటూ వర్థంతి ప్లెక్సీలు కట్టించి కర్మ ఖాండ జరిపించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్ లో జరిగింది. తమకు ఇష్టం లేని వివాహం చేసుకుందన్న కోపంతో దారుణానికి పాల్పడ్డాడు. గుండు గీయించుకుని.. దినకర్మలు నిర్వహించడమే కాకుండా ఆమెకు పిండప్రదానం చేశాడు.

జిల్లాలోని చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అదే గ్రామానికి చెందని వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ సమీప బంధువులే కావడంతో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్న జంట పెద్దలను ఆశ్రయించారు. తాము ప్రేమించుకున్నామని.. పెళ్లి చేయాలని కోరారు. అందుకు పెద్దలు ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఈ నెల 13న గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

తమను కాదని ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుందని భార్గవి తండ్రి కోపంతో రగిలిపోయాడు. తన కూతురితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆమె ఇప్పటితో చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగని ఆయన తన కూతురు చనిపోయిందంటూ గుండు గీయించుకుని ఆమెకు కర్మకాండలు జరిపించాడు. కూతురి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కూతురి ప్రేమ వివాహాన్ని భరించలేక తండ్రి చేసిన పని గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

Published on: Feb 04, 2022 09:32 AM