ఈ రైతు ఐడియా భలే ఉందే..అసలు ఏం చేశాడంటే?
పంటపొలంలో అడవి జంతువులు, పక్షులు దాడి చేసి నాశనం చేయకుండా ఉండేందుకు రైతులు పలు రకాల చర్యలు చేపడుతుంటారు. అయితే, ఇందుకోసం సాధారణంగా రైతులు పంట పొలంలో వినూత్న పద్ధతులను అనుసరిస్తుంటారు. కొంతమంది రైతులు పక్షులను తరిమికొట్టేందుకు తమ పొలాల్లో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. మరికొందరు అడవి జంతువులను భయపెట్టేందుకు రకరకాల ఫ్లేక్సీలను ఏర్పాటు చేస్తుంటారు. మరికొందరు దెయ్యాలు, సినీ తారల ఫోటోలతో కూడా ఫ్లేక్సీలు కూడా కడుతుంటారు.
ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం తన మిరప తోటలో వెరైటీ ప్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇక ఆ ప్లెక్సీ ని చూసిన వారంతా ఆశ్చర్యంగా, ఆసక్తిగానూ చూస్తున్నారు. కూసుమంచి మండలం తురకగూడెంకు చెందిన సురేష్ అనే రైతు రెండు ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు. ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో తన మిరప పంటపై ఇతరుల దృష్టి పడకుండా పలు రకాల ప్లెక్సీ లు ఏర్పాటు చేశాడు. అందులో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మాత్రం రైతు ఆవేదనకు అద్దం పడుతోంది. ప్లెక్సీ లో “అప్పు చేసి వ్యవసాయం చేస్తున్న నన్ను చూసి ఏడవకురా” అనే అక్షరాలతో పాటు యువత మేలుకో రైతన్నను ఆదుకో అనే నినాదంతో ఏర్పాటు చేయడంతో…ఆదారిలో వెళ్లే వారంతా సురేష్ ఏర్పాటు చేసిన ప్లెక్సీని ఆసక్తిగా చూస్తున్నారు.