AP News: మొన్న కిలో రూ.200.. ఇవాళ క్వింటాల్ రూ.200.. కన్నీరు పెడుతున్న టమాట రైతు
మదనపల్లె అయినా మహారాష్ట్రలో అయినా.. ప్రతిసారీ టమాటా రైతులకు అవే కష్టాలు. పంట బాగా పండినప్పుడు కిలోకి 2 రూపాయల కూడా రావడం లేదు. 20 కేజీల ట్రేకి మార్కెట్‌లో 40 రూపాయలు రావడం గగనం అయిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొందరైతే రోడ్డుపైనే టమాటాలు పారబోసి నిరసన తెలిపారు. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండడంతో మార్కెట్‌కు వచ్చిన సరుకంతా కొనేవారు లేక కుళ్లిపోయే పరిస్థితి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. మొన్నటి వరకు చుక్కల్ని చూపించిన టమాటా.. ఇప్పుడు పాతాళానికి పడిపోయింది..ధరలు తగ్గడం సామాన్యులకు గుడ్ న్యూసే అయినప్పటికీ.. రైతున్నల చేత మాత్రం కన్నీళ్లు పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ మార్కెట్లలో కిలో టమాటా 20-30 రూపాయలు పలుకుతోంది. కానీ, పాపం రైతు పంటను అమ్ముకునే రైతు బజార్లలో మాత్రం దారుణమైన ధరలు ఉంటున్నాయి. ఆ రేట్లతో టమాటా రైతులకు అస్సలు గిట్టుబాటు అవ్వడం లేదు.
కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా కేవలం 3 లేదా 2 రూపాయలు మాత్రమే పలుకుతోంది. 100 కేజీల టమాటాకు కేవలం 200 రూపాయలు మాత్రమే వస్తుండటంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. టమాటా నిల్వలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు చేరుతుండటం..కొనడానికి కొనుగోలుదారులు ఎవరూ లేకపోవటం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక భారీగా నష్టపోతున్నామని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎరువులు, పురుగుల మందులు ఇతర ఖర్చులు పక్కనపెడితే కనీసం సరుకు రవాణా కూడా కూడా డబ్బులు రావటం లేదని వాపోతున్నారు. కొందరు రైతులు అయితే రవాణా ఖర్చులు దండగ అని భావించి పండించిన టమాటాను రోడ్లు వెంట పారబోస్తున్నారు. నెల రోజుల క్రితం మిడిల్ క్లాస్ జనాలు కొనేందుకు కూడా అందకుండా పోయిన టమాటా.. ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా పడిపోయిందో.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..