Andhra: ఆలయం హుండీ లెక్కిస్తుండగా కనిపించిన స్లిప్.. అందులో ఏముందని చూడగా

Edited By: Ravi Kiran

Updated on: Sep 05, 2025 | 8:11 PM

అమ్మంటే ప్రేమ.. అమ్మవారు అంటే భయం.. జాలి, దయలేని దొంగలకు కూడా అప్పుడప్పుడు దేవుడంటే భయమే. సరిగ్గా అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఆలయంలో హుండీ ఎత్తుకెళ్లి.. మళ్లీ నెలరోజుల తర్వాత అమ్మవారు అంటే భయంతో దొంగలు హుండీ నగదు తీసుకొచ్చి మళ్ళీ ఆలయంలోని వదిలి వెళ్ళిపోయారు.

బుక్కరాయసముద్రం ముసలమ్మ తల్లి దేవాలయంలో సరిగ్గా నెలరోజుల క్రితం దొంగలు హుండీని ఎత్తుకెళ్లారు. ముసలమ్మ తల్లి దేవాలయంలో దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. అయితే దొంగతనం జరిగిన నెల రోజుల తర్వాత… మళ్లీ ముసలమ్మ తల్లి దేవాలయంలోని హుండీ నగదు దొంగలు వదిలేసి వెళ్ళిపోయారు. నగదు వదిలేసి వెళ్లిన మూటలో ఓ లెటర్ కూడా రాసిపెట్టి వెళ్లారు. నెలరోజుల క్రితం తాము నలుగురు వ్యక్తులు కలిసి ముసలమ్మ తల్లి దేవాలయంలో హుండీ చోరీ చేశామని.. హుండీ దొంగతనం చేసిన తర్వాత నుంచి తమ పిల్లలు అనారోగ్యం పాలయ్యారని ఆ లెటర్లో రాశారు. తప్పైపోయింది అమ్మ.. దొంగతనం చేయడం వల్ల మా పిల్లలు అనారోగ్యంతో సీరియస్ గా ఉన్నారని.. తమను క్షమించమ్మా అని ఆ లెటర్లో రాశారు. అదేవిధంగా అమ్మవారు హుండీలో కొంత నగదు వాడుకున్నామని కూడా దొంగలు లెటర్లో రాసుకొచ్చారు. దొంగతనం చేసిన నెల రోజుల తర్వాత అమ్మవారి ఆగ్రహంతో భయపడి పోయిన దొంగలు తిరిగి అమ్మవారి హుండీ నగదును లెటర్ తో కలిపి ఆలయంలోనే వదిలి వెళ్ళడంతో ఆలయ ధర్మకర్త పోలీసుల సమక్షంలో హుండీని లెక్కించారు.

Published on: Sep 05, 2025 08:11 PM