స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Updated on: Nov 11, 2025 | 1:50 PM

ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న స్పైస్‌జెట్ విమానానికి ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ల అప్రమత్తతతో కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా దిగారు. ఇటీవల విమాన ప్రమాదాల భయాందోళనల మధ్య ఈ ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.

ఇటీవల విమాన ప్రమాదాలు ప్రజలను తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓవైపు విమానాల్లో సాంకేతిక లోపాలు, మరోవైపు కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను ఓపెన్ చేసేందుకు ప్రయత్నిండం.. తోటి ప్రయాణికులతో గొడవలకు దిగడంతో విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయడం లాంటి ఘటనలు నెట్టింట చూశాం. తాజాగా సాంకేతిక లోపం కారణంగా స్పైస్‌ జెట్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న స్పైస్‌జెట్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ అధికారుల కథనం ప్రకారం, స్పైస్‌జెట్‌కు చెందిన SG-670 విమానం ఆదివారం రాత్రి ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కోసం దిగుతున్న సమయంలో, విమానంలోని ఓ ఇంజిన్ ఫెయిలైనట్టు పైలట్లు గుర్తించారు. వెంటనే వారు అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. పైలట్ల నుంచి సమాచారం అందగానే విమానాశ్రయ అధికారులు వెంటనే ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక, సహాయక బృందాలను రన్‌వే వద్ద సిద్ధంగా ఉంచారు. రాత్రి 11:38 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఫుల్ ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నట్లు ఓ అధికారి తెలిపారని సమాచారం. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి కిందకు దించారు. ఈ ఘటనపై స్పైస్‌జెట్ సంస్థ సోమవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. కోల్‌కతాలో ల్యాండింగ్ సమయంలో తమ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని, అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సాధారణంగానే విమానం నుంచి కిందకు దిగారని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు వివరించారు. ప్రస్తుతం విమానాన్ని ఇంజినీరింగ్ బృందాలు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాయని సంస్థ పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

50 మంది విద్యార్థులను కాపాడి ప్రాణాలు వదిలిన బస్ డ్రైవర్..

అందెశ్రీ అందుకే చనిపోయారా ?? గాంధీ వైద్యులు సంచలన ప్రకటన

Kadapa: అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన కమెడియన్ అలీ, హీరో సుమన్

Jubilee Hills Bypoll Updates: పోలింగ్ బూత్ లకు రాని జూబ్లీహిల్స్ ఓటర్స్.. కారణం ఏంటి..?

Jubilee Hills Bypoll: డ్రోన్ కెమెరాలతో జూబ్లీహిల్స్ ఓటింగ్ పర్యవేక్షణ