తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు!

Updated on: Jul 25, 2026 | 9:26 PM

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వర్షాలు ఊపందుకున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అస్సాంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

తెలుగు రాష్ట్రాలను వరుణుడు కరుణిస్తున్నాడు. ఎల్‌నినోతో మొన్నటివరకూ అస్సలు చినుకు జాడే లేకపోగా.. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏపీ, తెలంగాణలో మేఘావృతమై.. మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల కదిలికలతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ప్రజలకు, కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ ఊరటనిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఉపరితలద్రోణుల పుణ్యమా అని ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు నిలకడగా కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లగా మారుతోంది. ఆకాశం మేఘావృతమై ఉండి, దక్షిణ కోస్తా ప్రాంతంలో చల్లటి ఉపరితల గాలులు బలంగా వీస్తున్నాయి. రాయలసీమ జిల్లాలలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా & రాయలసీమ జిల్లాలైన ఏలూరు, కృష్ణా, వైఎస్ఆర్ కడప, కాకినాడ, పోలవరం, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, తిరుపతి జిల్లాలలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం, పల్నాడు, బాపట్ల, మర్కాపురం, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో, స్థానికంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడుతుంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. జైసల్మేర్‌, కోట, గుణ, దామోహ్‌, డాల్టన్‌గంజ్‌, కాంటాయ్‌ మీదుగా ఆగ్నేయ దిశగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది విస్తరించి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. భాగ్యనగరంతో పాటు పలు జిల్లాల్లో రాబోయే రెండ్రోజుల పాటు వానలు కురుస్తాయని, జులై 26 తర్వాత వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు సాధారణం వర్షపాతంతో పోలిస్తే భారీగా లోటు నమోదైంది. తొలకరి పలకరించినా, నైరుతి రుతుపవనాలు విస్తరించినా ‘ఎల్‌నివో’ ప్రభావం వల్ల వర్షాలు అనుకున్నంతగా కురవడం లేదు. తెలంగాణలో గతంతో పోలిస్తే సాధారణం కంటే 25 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 60 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఈ ఏడాది ఎల్‌నివో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల రైతన్నలు కొంతవరకు ఊరట చెందుతున్నారు. ఉత్తర భారతంలో వరుణుడు దంచి కొడుతున్నాడు. అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. బ్రహ్మపుత్ర నదితో పాటు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు నీట మునిగాయి. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా తూర్పు అస్సాంలోని జిల్లాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లోని దాదాపు 7 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా శివసాగర్, చరాయిదేవు, జోర్హాట్ జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వరదల కారణంగా ఇప్పటివరకు 61 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేక పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి.. తాగునీరు, ఆహారం, మందులు అందిస్తున్నారు. నష్టపోయిన కుటుంబాలకు త్వరలోనే ప్రత్యేక పునరావాస ప్యాకేజీని ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఘాటెక్కిన వంటిల్లు..భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలు

Viral Video: గడ్డికోస్తున్న గొర్రెలు.. ఎక్కడంటే ?

వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..

రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?

Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!

Follow Us