Weekend Hour: ఎన్నికల వేళ సరికొత్త టాస్క్.. రూ.2 వేల రాజకీయం..
నోట్ వాపసీతో ఎవరికి షాక్.? సామాన్యులకా ... పారిశ్రామికవేత్తలకా... రియల్ వ్యాపారులకా... బ్యాంకులకా..? ఇవేమీ కాకుండా మరో వ్యూహం ఉందా? ఎన్నికవేళ విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహమన్న ఆరోపణల మాటేంటి? 8 రాష్ట్రాల ఎన్నికలకు ఈ నిర్ణయానికి లింక్ వుందా? మళ్లీ వెయ్యి నోటు తెరపైకి వస్తుందా? విపక్షాల వాదనలేంటి? అధికారపక్షం ఇస్తున్న వివరణ ఏంటో డీటైల్డ్‌గా చర్చిద్దాం..!
నోట్ వాపసీతో ఎవరికి షాక్.? సామాన్యులకా … పారిశ్రామికవేత్తలకా… రియల్ వ్యాపారులకా… బ్యాంకులకా..? ఇవేమీ కాకుండా మరో వ్యూహం ఉందా? ఎన్నికవేళ విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహమన్న ఆరోపణల మాటేంటి? 8 రాష్ట్రాల ఎన్నికలకు ఈ నిర్ణయానికి లింక్ వుందా? మళ్లీ వెయ్యి నోటు తెరపైకి వస్తుందా? విపక్షాల వాదనలేంటి? అధికారపక్షం ఇస్తున్న వివరణ ఏంటో డీటైల్డ్‌గా చర్చిద్దాం..!
రెండు వేల నోటు ఇక చరిత్రే. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 2 వేల నోటను తీసుకొచ్చారు. ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. గత రెండేళ్లుగా మార్కెట్‌లో 2 వేల నోటు చెలామణి తగ్గుతూ వస్తోంది. సో.. ఈ ఉపసంహరణతో సామాన్యుడికి పెద్దగా వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ ఈ నోట్ వాపసీ ఇప్పుడు పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతోంది.! రాజకీయమంతా 2 వేల నోటు చుట్టూనే తిరుగుతోంది. విపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అసలు 500, 1000 నోట్లు రద్దు చేసి 2 వేల నోటు మార్కెట్‌లోకి ఎందుకు తెచ్చారు.? ఇప్పుడు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఈ నిర్ణయంతో సాధించింది ఏంటి? ఇప్పటి వరకు ఎంత బ్లాక్‌మనీని వెనక్కి తెచ్చారు.? ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
నోట్ల రద్దు సంపూర్ణం.. సాధించింది మాత్రం శూన్యం అంటోంది కాంగ్రెస్. కచ్చితంగా ఇది రాజకీయ నిర్ణయమేనని విమర్శిస్తోంది.! ఇక్కడే విపక్షాల నుంచి మరో ప్రధాన ఆరోపణ కూడా వినిపిస్తోంది. రాబోయే 6 నెలల్లో దాదాపు 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. +ప్రచారం, ఇతర ఖర్చులు, ఓటర్లకు పంపిణీ వంటి అవసరాల కోసం ఇప్పటికే పార్టీలు భారీ ఎత్తున 2 వేల నోట్లను పోగేసుకున్నాయన్నది ఓ వాదన. చాలా చోట్ల వాటిని క్షేత్రస్థాయికి కూడా తరలించారు. ఇప్పుడు నోట్ల ఉపసంహరణతో వాటన్నింటినీ మార్చుకోవడం అతిపెద్ద టాస్క్..! ఆ నోట్లను దాచుకోలేరు. ఒక్కసారిగా బయటకూ తీయలేరు. ఒకేసారి పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే లెక్కలు చెప్పాల్సి వస్తుంది. ఐటీ శాఖ నజర్ ఎలాగూ ఉంటుంది. సో.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. ఎన్నికల వేళ విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే ఈ నిర్ణయమన్నది కొందరి ఆరోపణ.
అధికార BJP వర్షన్ మాత్రం మరోలా ఉంది. విపక్షాల విమర్శలు అర్థరహితమంటున్నారు కమలనాథులు. దేశం, ప్రజల హితం కోసమే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం 30 శాతం నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని చెబుతున్నారు. సామాన్యులు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు..
మొత్తానికి 2 వేల నోటు ఉపసంహరణ విషయంలో ఎవరి వాదన వాళ్లదే. అధికార పక్షం మంచి జరగుతుందని వాదిస్తే.. విపక్షాలు మాత్రం రాజకీయం అంటున్నాయి. ఇక బ్లాక్‌మనీపైనా మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక్కడే మరికొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. మళ్లీ వెయ్యి నోటు తెరపైకి వస్తుందని కొందరంటుంటే.. 500, 200 నోట్లను కూడా వెనక్కి తీసుకుంటారన్నది ఇంకొందరి వాదన. అయితే ప్రస్తుతానికి ఇవి అనుమానాలు మాత్రమే.