Pithapuram: వర్మపై దాడి చేసింది జనసైనికులేనా.. ఆయనే క్లారిటీ ఇచ్చేశారు..
పవన్ కల్యాణ్ విజయానికి సహకరించిన వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా వన్నెపూడి గ్రామ సర్పంచి కందా సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా స్థానిక దత్తాత్రేయస్వామి ఆలయం ఎదుట కొందరు వ్యక్తులు వర్మ కారును నిలిపి దాడికి పాల్పడ్డారు. అయితే ఇలాంటి పిరికిపంద చర్యలకు భయపడేది లేదన్నారు వర్మ.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి చేసింది జనసైనికులే అని నెట్టింట కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే తనపై జరిగిన దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీ నుంచి ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్లిన 25 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీసాలతో, ఇటుకలతో తన కారుపై దాడికి తెగబడ్డారని అన్నారు. తనను చంపేందుకే ఈ కుట్ర జరిగిందన్నారు. గతంలో సాయి ధరమ్ తేజ్‌పై కూడా ఇదే తరహాలో దాడి చేసారని చెప్పారు. వైసీపీ నేతలు ప్రోద్బలంతో ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తామేమీ చేతులు కట్టుకు ఉండబోమన్నారు. ఈ విషయంపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయబోనన్నారు వర్మ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..