ALAI BALAI: దత్తాత్రేయ అద్వర్యంలో ‘అలాయ్ బలాయ్’ అదుర్స్ .. సందడిగా జలవిహార్.. (వీడియో)
అన్ని పక్షాలు ఏకమై.. అన్ని రంగాల ప్రముఖులు మమేకమై.. అందరి ఆత్మీయ సమ్మేళన వేదిగా నిలిచింది జలవిహార్‌లో జరిగిన దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమం. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కరోనా వారియర్స్ వరకు అంతా హాజరై అలయ్ బలయ్ అంబలి తాగి వేడుకను సందడిగా మార్చారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దసరా పండుగ తర్వాత అందరి ఆత్మీయ కలయిక కోసం 16 ఏళ్ల కిందట అలయ్ బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బద్ద శత్రువులు సైతం వచ్చి అంబలి తాగి అవతలి వ్యక్తిని కౌగిలించుకున్న ఏకైక వేదిక అలయ్ బలయ్. దత్తన్న రాజ్యాంగబద్ద పదవిలో ఉండటంతో ఆయన కూతురు బండారు విజయలక్ష్మి ఆ బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకొని జలవిహార్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రులు మహమ్మూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేకే, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు సహా పలువురు వీఐపీలు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మి, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు.
అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా తొలుత గవర్నర్ తమిళిసై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. గిరిజన మహిళలతో కలిసి గవర్నర్ నృత్యం చేశారు. కోలాటం ఆడారు.వేదిక వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దుర్గామాత, జమ్మిచెట్టుకు పూజలు చేశారు. అలయ్ బలయ్ లో అంబలి ఇచ్చి కండువాలను కప్పారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆలింగనాలతో కాకుండా నమస్కారాలతో అలయ్ బలయ్‌ను జరుపుతున్నారు. డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ అధినేత ప్రసాద్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, బయోలాజికల్-ఇ ఎండీ మహిమ దాట్ల, మా అధ్యక్షుడు మంచు విష్ణు, కవితను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు. కరోనా విపత్కర పరిస్థితిని ఎదుర్కొని బయటపడ్డామని.. కానీ ముప్పు ఇంకా తొలగిపోలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయడం, అందరినీ మమేకం చేసే గొప్ప కార్యక్రమని వెంకయ్యనాయుడు ప్రోగ్రాంను అభినందించారు..
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)