తరుముకొస్తున్న మొంథా తుఫాన్‌.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్

Updated on: Oct 27, 2025 | 8:04 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఇది ప్రస్తుతం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. గడచిన మూడు గంటల్లో గంటకు 13 నుంచి 18 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. చెన్నైకి 600 కి.మీ., విశాఖపట్నంకి 740 కి.మీ., కాకినాడకి 710 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది సోమవారం ఉదయానికి తుపానుగా బలపడి.. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మొంథా తుపాను మంగళవారం రాత్రికి తీవ్రతుఫానుగా మారి కళింగపట్నం-మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం తుపాను కాకినాడకు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో సోమవారం నుంచి ఏపీలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అన్ని ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విజయనగరం, విశాఖలో మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే మొంథా తుఫాన్ ఎంత వేగంతో ఏపీ తీరాన్ని తాకుతుందనేదే ఇప్పుడు కలవరం సృష్టిస్తోంది. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే 2014లో విశాఖను వణికించిన హుద్‌హుద్‌ తుఫాన్‌ బీభత్సం జనానికి గుర్తుకొస్తోంది. అప్పట్లో 200 కి.మీ. వేగంతో హుదూద్‌ తుఫాన్‌…విశాఖ తీరాన్ని తాకి విలయం సృష్టించింది. దాదాపు రూ. 21 వేల కోట్ల ఆర్థిక నష్టాన్ని కలగజేసింది. అయితే ఇప్పుడు దూసుకొస్తున్న మొంథా తుఫాన్‌, తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది హుద్‌హుద్‌ అంత పెను తుఫాన్‌ కాకపోయినప్పటికీ, ఏపీ సర్కార్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అదే విషయాన్ని ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం సూచించింది. తుఫాన్‌ ముప్పును ఎదుర్కోవడానికి అధికారులు NDRF, SDRF బృందాలను మోహరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగపంచమి వేళ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

ప్రైవేట్ బస్సులంటేనే హడల్‌.. ఆర్టీసీకి పెరిగిన ఆదరణ

అన్నం కోసం వస్తే.. ప్రాణమే పోయింది

Shreyas Iyer: ICUలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్‌ అయ్యర్‌

వైట్‌హౌస్‌లో కూల్చివేతలు.. జనం మాట పట్టించుకోని ట్రంప్