ఇదేనా క్రమశిక్షణ.. నేను మాట్లాడే టైమ్‌కి భోజనానికి వెళ్తారా.. టీచర్లపై మంత్రి కోమటిరెడ్డి అసహనం

Updated on: Sep 05, 2025 | 7:04 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మళ్లీ అలిగారు. మొన్న ఉత్తమ్‌ కుమార్ రెడ్డిపై అలిగిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఈ సారి టీచర్ల మీద అలిగారు. అలగడమే కాదు అసహనం కూడా వ్యక్తం చేశారు. సాక్షాత్తు మంత్రిని.. నేను మాట్లాడే టైమ్‌కి భోజనానికి వెళ్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకే డిసిప్లేన్‌ అంటే ఏంటో చెప్పారు కోమటిరెడ్డి..

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన టీచర్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానించారు. ఈ సమావేశంలో చివరగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడే టైమ్‌కి సగానికి పైగా టీచర్లు భోజనం కోసం డైనింగ్ హాల్ వైపు వెళ్లారు. దీంతో ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి. టీచర్ల క్రమశిక్షణపై..వేదికపై ఉన్న డీఈవో బిక్షపతిని మందలించారు. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నా కూడా.. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చానని.. కానీ టీచర్లు ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు కోమటిరెడ్డి.

ఉపాధ్యాయుల క్రమశిక్షణ ఇదేనా అంటూ కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉపాధ్యాయుల తీరుపై డీఈఓను కోమటిరెడ్డి మందలించారు.. మరోవైపు, అప్పటికే భోజనాల టైమ్‌ దాటిపోయిందంటున్నారు ఉపాధ్యాయులు. తాము కావాలని వెళ్లలేదంటున్నారు.