మంగళాద్రి ముఖ మండపానికి మహర్దశ
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి లక్ష్మీ నరసింహ ఆలయ 500 ఏళ్ల చరిత్ర గల ముఖమండపం పగుళ్లతో ఉనికి ప్రమాదంలో పడింది. రూ.6.4 కోట్ల ప్రభుత్వ నిధులతో దానిని తొలగించి పునర్నిర్మించాలని నిర్ణయించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా, చారిత్రక ఆనవాళ్లను కాపాడుతూ కొత్త మండపాన్ని నిర్మించనున్నారు. ఇది నాటి కళా వైభవానికి నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్‌లోని నారసింహ క్షేత్రాల్లో మంగళగిరిలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఒకటి. కృతయుగం నాటి ఆలయంగా దీనికి పేరుంది. ఇక్కడి ఆలయ గాలి గోపురం 157 అడుగులతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత్య ఎత్తైన గోపురంగా రికార్డులకెక్కింది. సుమారు 2 శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రభువు.. రాజా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ గాలిగోపురాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ రాజ గోపురం కాలక్రమంలో తగిన మరమ్మతులకు నోచుకోకపోవటంతో.. స్థానికులంతా కలిసి దీని పరిరక్షణకు నడుం బిగించారు. ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకొని ఇప్పటికీ చారిత్రక కట్టడాన్ని కాపాడుతోంది. ఇక.. ఈ ఆలయంలోని ఈ గోపురానికి, స్వామివారి గర్భాలయానికి మధ్యలో ఉన్న ముఖమండపాన్ని.. దక్షిణ భారతపు గొప్ప చక్రవర్తుల్లో ఒకరైన శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారని చరిత్ర చెబుతోంది. సుమారు 500 ఏళ్ల చరిత్ర గల ఈ నల్లరాతి మండపంలోని మొత్తం 28 స్తంభాలు..నాటి అద్భుతమైన కళావైభవానికి రుజువులుగా నిలుస్తున్నాయి. ఏటా స్వామి వారి కల్యాణం, పలు ఉత్సవాలను ఈ మండపంలోనే నిర్వహిస్తున్నారు. అయితే, కొంతకాలం క్రితం ఈ ముఖ మండపానికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో మండపంలో ఇనుప గడ్డర్స్ ఏర్పాటు చేసి దాన్ని పరి రక్షించుకుంటూ వచ్చారు. అయినా పగుళ్లు ఆగకపోగా, మండపం కప్పు భాగంలోని పెద్ద నాపరాళ్లు సైతం బీటలు వారాయి. దీంతో ఆ మండపం ఉనికి ప్రమాదంలో పడిందని గుర్తించిన ప్రభుత్వం.. ఆ మండపాన్ని తొలగించి పునర్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం రూ.6.4 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. వందల ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నూతన మండపాన్ని నిర్మించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Organ Donation: మరణం తర్వాత అవయవదానం
ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు
తాగకపోతే దాహం, తాగితే రోగం 143 కృష్ణా గ్రామాల వారి ఆవేదన
