ప్రైవేట్ బస్సులంటేనే హడల్‌.. ఆర్టీసీకి పెరిగిన ఆదరణ

Updated on: Oct 27, 2025 | 7:53 PM

కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైన ఘటన ప్రైవేట్ ట్రావెల్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. భయంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల వైపు చూసేందుకే జంకుతున్నారు. దీంతో.. హైదరాబాద్ నుంచి ఏపీ, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల టికెట్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. శనివారం ఈ మార్పు స్పష్టంగా కనిపించింది.

ప్రమాదానికి ముందు గురువారం హైదరాబాద్ నుంచి కావలికి రూ. 1800 వసూలు చేసిన కావేరి ట్రావెల్స్, ఘటన తర్వాత అదే టికెట్‌ను రూ. 1100 తగ్గించింది. ఇతర ప్రైవేటు ఆపరేటర్లు సైతం ధరలను తగ్గించారు. సాధారణంగా రూ. 2000 ఉండే హైదరాబాద్-వెల్లూర్ టికెట్‌ను రూ. 1500కే విక్రయించారు. అయినప్పటికీ, వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారిలో చాలామంది టికెట్లను రద్దు చేసుకున్నారు. కొత్త బుకింగ్‌లు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో శనివారం పలు ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్ కౌంటర్లు ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. చాలా బస్సులు సగం సీట్లతోనే సర్వీసులు నడపాల్సి వచ్చింది. కర్నూలు ఘటనతో ప్రయాణికుల్లో భయం పెరిగింది. బస్సులు ఎక్కే ముందు ప్రయాణికులు డ్రైవర్ల గురించి, వారి అనుభవం గురించి నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. బస్సులో మండే స్వభావం ఉన్న బ్యాటరీలు లేదా ఇతర పార్శిళ్లు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. బస్సు ఎక్కాక కూడా, “బాబూ.. దయచేసి జాగ్రత్తగా నడపు” అని డ్రైవర్లను వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కూడా అప్రమత్తమయ్యారు. ఫిట్‌నెస్ సరిగా లేని బస్సులను రోడ్లపైకి తీస్తే అధికారులు సీజ్ చేస్తారనే భయంతో చాలా సర్వీసులను రద్దు చేసుకున్నారు. ప్రయాణికుల లగేజీని, పార్శిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో భద్రతపై అనుమానాలతో ప్రయాణికులు ప్రభుత్వ రంగ ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సర్వీసులకు ఆదరణ పెరిగింది. శనివారం బెంగళూరు, విజయవాడ మార్గాల్లో ఆర్టీసీ బస్సుల్లో టికెట్ బుకింగ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ తమ స్లీపర్ బస్సులను ప్రమోట్ చేస్తోంది. “సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణానికి ఆర్టీసీని ఎంచుకోండి” అంటూ తమ స్లీపర్ బస్సుల ఫొటోలతో ‘ఎక్స్’లో ప్రచారం చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అన్నం కోసం వస్తే.. ప్రాణమే పోయింది

Shreyas Iyer: ICUలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్‌ అయ్యర్‌

వైట్‌హౌస్‌లో కూల్చివేతలు.. జనం మాట పట్టించుకోని ట్రంప్

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరో యాక్సిడెంట్

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు

Published on: Oct 27, 2025 07:52 PM