తాగకపోతే దాహం, తాగితే రోగం 143 కృష్ణా గ్రామాల వారి ఆవేదన
ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా జలాలు ఎన్టీటీపీఎస్ నుండి వెలువడే బూడిదతో తీవ్రంగా కలుషితమవుతున్నాయి. ఈ నీరు 143 గ్రామాలకు సరఫరా కావడంతో ప్రజలు చర్మ వ్యాధులు, పంట నష్టంతో బాధపడుతున్నారు. అధికారులు శాంపిల్స్ సేకరించినప్పటికీ, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది, నిరసనలకు సిద్ధమవుతున్నారు.
కృష్ణాజలాల్లో కలుషిత బూడిద అవశేషాలు కలుస్తున్నాయని మరోసారి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజలాలతో పచ్చగా ఉండాల్సిన తమ పంటపొలాలు.. ఇప్పుడు బూడిదతో కలుషితమైన నీటితో చవుడు భూములుగా మారే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలాలు, కొండపల్లి మున్సిపాలిటీ, తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలాలు కలిపి మొత్తం 143 గ్రామాలలో ఈ బూడిద కలిసిన నీరే సరఫరా కావటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నదీ తీరంలో విద్యుత్ ఉత్పత్తికి నిర్మించిన.. ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడే బూడిద నీరు డ్రెయినేజీ ద్వారా నేరుగా కృష్ణా నదిలో కలుస్తోందని స్థానికులు చెబుతున్నారు.అదే నీరు తిరిగి గ్రామాల ఫిల్టర్ బెడ్స్‌కి చేరుతోంది. ఈ నీరు తాగటం వల్ల పిల్లలకి చర్మ వ్యాధులు వస్తున్నాయని, ఈ నీటి దుర్వాసన భరించలేకపోతున్నామని సమీప ప్రాంత గ్రామవాసులు చెబుతున్నారు. తాగకపోతే దాహం, తాగితే రోగం వ్యాధి అని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు గ్రామాల్లో అధికారులు పర్యటించి, నీటి శాంపిళ్లు సేకరించటం తప్ప.. సమస్య పరిష్కారానికి ఎలాంటి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించలేదని 143 గ్రామాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ఆదేశాలతో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య పరిశీలించారని, ప్లాంటు నుంచి బూడిద నీరు పంప్ హౌస్ వద్ద నదిలో కలుస్తోందని ప్రత్యక్షంగా చూశారని ప్రజలు తెలిపారు. పంప్ హౌస్‌ను ఎగువ వైపున మార్చాలని ఆదేశాలు ఇచ్చి నెలలు గడిచినా.. అది ఆచరణకు నోచుకోలేదని వారు వాపోయారు. ఈ సమస్య కారణంగా ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టు అర్థమవుతున్నా.. అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. వారు వాగ్దానాలకు పరిమితమవటం తప్ప ఫలితం లేదని వారు గుర్తుచేస్తున్నారు. ఇది నిర్లక్ష్యం కాదు, నేరమని, ఇకనైనా ఈ సమస్య గురించి పట్టించుకోకపోతే.. పోరాటాలకు ప్రజలను సిద్ధం చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతికి రైల్వే టికెట్ బుకింగ్ కు ఇదే రైట్ టైమ్
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
RGV: చిరంజీవికి రామ్‌గోపాల్ వర్మ సారీ..!
