Karnataka Farmers: చెరుకు రైతుల అసహనం.. రోడ్డుపై బీభత్సం
కర్ణాటకలోని ముధోల్ లో చెరకు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సమీరవాడి గోదావరి షుగర్ ఫ్యాక్టరీ నుండి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళనలకు దిగారు. ట్రాక్టర్లను అడ్డుకుని, చెరకును దహనం చేసి నిరసన తెలిపారు. బకాయిల చెల్లింపు, ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించారు.
కర్ణాటక రాష్ట్రంలోని ముధోల్ ప్రాంతంలో చెరకు రైతుల ఆగ్రహం తీవ్రరూపం దాల్చింది. చెరకు బకాయిలు చెల్లించకపోవడంపై రైతులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహాలింగపూర్ పట్టణం సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమీరవాడి గోదావరి షుగర్ ఫ్యాక్టరీకి చెరకు తరలిస్తున్న ట్రాక్టర్‌లను రైతులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఫ్యాక్టరీ మూసివేయడంతో చెరకు సాగు చేసిన రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం అందక రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సమీరవాడి గోదావరి షుగర్ ఫ్యాక్టరీకి చెరకు తరలిస్తుండగా ఇద్దరు రైతులు రోడ్డుపైకి వచ్చి ట్రాక్టర్‌లను అడ్డుకున్నారు. రైతులు యాజమాన్యాన్ని చర్చల వేదికకు రావాలని తమ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డుపై నిలిపిన ట్రాక్టర్‌ల టైర్లలో గాలి తీసేసారు రైతులు. ఒక ట్రాక్టర్ ట్రాలీని కూల్చి రోడ్డుపై చెరకు చెల్లాచెదురుగా పడేశారు. అదే సమయంలో మరో ట్రాక్టర్లో చెరకుకు నిప్పంటించి నిరసన తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలంటూ నినాదాలు చేశారు. రాయన్న చౌక్ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్‌లు, బైక్‌లపై సమీరవాడి గోదావరి ఫ్యాక్టరీ వైపు బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైతులు సమీరవాడి ఫ్యాక్టరీపై ముట్టడి చేసేందుకు సిద్ధమవుతుండగా మధ్యలో మహాలింగపూర్ సమీప రోడ్డుపైనే ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రైతులతో చర్చించి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయితే రైతులు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. చెరకు బకాయిలు చెల్లించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు రైతు సంఘ నాయకులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రష్మికకు పబ్లిక్‌లోనే ముద్దుపెట్టేసిన రౌడీ హీరో
కిలో ఉల్లి ఒక్క రూపాయి మాత్రమే.. ఎక్కడంటే
భారీ శబ్ధంతో కూలిన బ్రిడ్జి.. ఎక్కడంటే..
