Tirumala: శ్రీవారికి 108 స్వర్ణ పుష్పాల విరాళం ఇచ్చిన భక్తుడు.. వాటి విలువ ఎంతంటే..?
కడప జిల్లా యర్రముక్కపల్లిలోని మామిళ్లపల్లెకు చెందిన 62 ఏళ్ల భక్తుడు రాజారెడ్డి బుధవారం ప్రఖ్యాత తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామికి 108 బంగారు కమలాలను కానుకగా సమర్పించారు. సుమారు రూ.2 కోట్ల విలువైన విరాళాన్ని లలితా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ సమక్షంలో ఆలయ అధికారులకు అందజేశారు. ఆరు నెలల వ్యవధిలో నైపుణ్యం కలిగిన కళాకారులచే ఈ బంగారు తామరపువ్వులను ప్రత్యేకంగా రూపొందించినట్లు కిరణ్ కుమార్ తెలిపారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న ఆలయానికి నిత్యం వేలల్లో భక్తులు వస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కానుకలు వేసేందుకు కూడా ఆలయంలో జనాలు పోటీ పడుతూ ఉంటారు. ఎవరి స్థాయిని బట్టి వారు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది నిలువు దోపిడి ఇస్తారు. ఇంకొందరు విదేశీ డాలర్లు, నగలు సమర్పిస్తారు. తాజాగా కడపకు చెందిన డాక్టర్ రాజారెడ్డి అనే భక్తుడు శ్రీవారికి 108 స్వర్ణ పుష్పాలను అందజేశారు. బుధవారం ఉదయం VIP బ్రేక్ సమయంలో ఆయన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కూడా ఉన్నారు. అనంతరం రాజారెడ్డి.. టీటీడీ అధికారులకు 108 బంగారంతో చేసిన పుష్పాలను శ్రీవారి సేవల కోసం డొనేట్ చేశారు. కిరణ్ మాట్లాడుతూ.. డాక్టర్ రాజారెడ్డి కోరిన మేరకు తమ స్వర్ణ కళాకారులు 6 నెలలపాటు శ్రమించి ఈ బంగారు పుష్పాలను తయారు చేశారని వెల్లడించారు. ఇందుకోసం ఆయన రూ.2 కోట్లకు పైగా రాజారెడ్డి వెచ్చించినట్లు తెలిపారు.