నిరుపయోగంగా ఎస్‌పీ బాలు ఇల్లు! ఎందుకలా..

|

Jan 12, 2025 | 7:59 PM

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. ఈ పేరు తెలియని వారు ఎవరైనా ఉంటారా? అందులోను నెల్లూరు జిల్లా ప్రజలకు అయితే ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంటే సొంత ఇంటి మనిషి లాగానే భావిస్తారు. ఎందుకంటే ఎస్పీ బాలు ఆ జిల్లా వాసే. చిన్నతనంలోనే సంగీతం పై ఆసక్తి కారణంగా నెల్లూరు వదిలి తమిళనాడు లో సెటిల్ అయ్యారు ఎస్పీ బాలు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఇక చూడండి అసలు విషయం. నెల్లూరు నగరంలోని తిప్పారాజు వారి వీధిలో ఎస్పీ బాలుకి సొంత ఇల్లు ఉండేది. ఎస్పీ బాలు చెన్నై లో సెటిల్ అయినప్పటికీ తన తల్లిదండ్రులు మాత్రం నెల్లూరు నగరంలోని తిప్పరాజు వీధిలో సొంత ఇంట్లో ఉండేవారు.

 అయితే కొన్నేళ్ల క్రితం ఎస్పీ బాలు తల్లిదండ్రులు కాలం చేయడంతో ఆ ఇంటిని సంగీత పాఠశాలకు ఇచ్చేందుకు 2020 లో ఎస్పీ బాలు నిర్ణయం తీసుకున్నారు.. కోటి రూపాయలు పైగా విలువైన ఇంటిని వేద పాఠశాలకు ఇచ్చేందుకు ఎస్పీ ముందుకు రావడం అలాగే కంచి పీఠాధిపతులు సూచించిన విధంగా పది లక్షలు ఖర్చు చేసి ఎస్పీ బాలు ఆ ఇంటిని రీ-మోడల్ చేసి మరీ సిద్ధం చేశారు. రీ మోడల్ చేసిన అనంతరం 2020 లో ఆ ఇంటిని కంచి పీఠాధిపతికి అందజేశారు ఎస్పీ బాలు. అయితే కాలక్రమేణా కోవిడ్ తో ఎస్పీ బాలు కాలం చేయడంతో కంచి పీఠం నిర్వాహకులు ఆ ఇంటిని ఉపయోగించుకోవడంలో విఫలం అయ్యారన్న మాటలు వినిపిస్తున్నాయి. నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో, ‘వేద-నాద’ అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి ఈ ఇంటిని ఉపయోగిస్తామని కంచి పీఠాధిపతి హామీ ఇచ్చారు. అయినప్పటికీ, ఐదేళ్లు గడిచిపోయాయి. వాగ్దానం చేసిన కార్యక్రమాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. దివంగత గాయకుడి అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేశారు. ఒకప్పుడు చైతన్యవంతమైన ఇల్లు ఇప్పుడు చీకటిలో ఉందని, ఎటువంటి కార్యకలాపాలు లేదా ప్రాథమిక నిర్వహణ లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపై కంచి పీఠం నెల్లూరు శాఖ నిర్వాహకుడు నందకిషోర్ స్పందించారు. తాము విరాళంగా ఇచ్చిన నివాసంలో మొదట పది మంది విద్యార్థులతో వేద పాఠశాలను ప్రారంభించామన్నారు. అయితే, సరిపోని సౌకర్యాల కారణంగా, ముఖ్యంగా విద్యార్థులు బస చేసిన టెర్రస్‌పై తాత్కాలిక షెడ్ కారణంగా వారు సవాళ్లను ఎదుర్కొన్నారని ఆయన వివరించారు. ఫలితంగా, విద్యార్థులను మరొక పాఠశాలకు మార్చవలసి వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతం ఇంట్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడంలేదు. భవిష్యత్తులో ఇంటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందేమో చూడాలి.