ప్రేమంటే ఇదే..చనిపోయిన తోడును లేపుతున్న పక్షి..కన్నీరు పెట్టిస్తున్న వీడియో
జంట పక్షులను చూసిన వారెవరైనా.. తమ జంటా అంత అన్యోన్యంగా ఉండాలనుకుంటారు. ఎంతో కఠినమైన మనుషులను సైతం కదిలించేంత ప్రేమ భావన..జంట పక్షుల్లో ఉంటుంది. తన జంటను కోల్పోయిన ఒక పక్షి కన్నీరు.. ఒక ఆటవికుడిని వాల్మీకిగా చేసింది. రామాయణం వంటి మహాకావ్య రచనకు ప్రేరేపించింది. కుటుంబ విలువలు, ధర్మం, ప్రేమ,మానవ సంబంధాల విలువలు తెలిపే ఆ మహాకావ్యం నేటికీ ప్రపంచానికి ప్రేరణనిస్తూనే ఉంది. కాగా, తాజాగా.. ఒక పక్షి జంట ఇలాగే చూపరులను కన్నీరు పెట్టించింది. తన భాగస్వామిని కోల్పోయిన ఓ హంస..ఎలాగైనా తన నెచ్చెలిని బతికించుకునేందుకు చేసిన ప్రయత్నం, పడిన తపన తాలూకూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ చెరువులోని హంసల జంటలో ఒకటి చనిపోయింది. విగతజీవిగా మారిన ఆ పక్షి శరీరం నీటిపై తేలుతుండగా.. దానిని దాని జంటపక్షి చూసింది. తన జంటను వదిలి వెళ్లలేకపోయింది. తన నేస్తం చనిపోయిందనే వాస్తవాన్ని జీర్ణించుకోలేని ఆ పక్షి, దాన్ని ఎలాగైనా తిరిగి బతికించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. తన ముక్కుతో నెడుతూ, రెక్కలతో కదుపుతూ మేల్కొల్పేందుకు విఫలయత్నం చేసింది. అక్కడ ఉండలేక.. అలాగని తన నేస్తాన్ని వదిలి వెళ్లలేక సతమతమై పోయింది. ఈ సీన్ చూసిన వారిని ఆ పక్షి తపన కదిలించింది. ఈ వీడియోను రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ఎక్స్ లో షేర్ చేశారు. “మరణంలో కూడా విడదీయలేనంత ప్రేమ. ఈ హంస చనిపోయిన తన భాగస్వామిని మేల్కొల్పే తీరును మాటల్లో వర్ణించలేము’ అని ఆయన చెప్పుకొచ్చారు. హంసలు ఒకసారి జత కడితే.. అవి జీవితాంతం మరో భాగస్వామి వైపు కన్నెత్తి చూడవని పక్షి శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా చలించిపోతున్నారు. “ఇదే నిజమైన ప్రేమంటే” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :