తరుముకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాల్లో స్కూల్స్ బంద్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి గురువారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తుందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
వాయుగుండం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయానికి శ్రీకాళహస్తిలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో వర్షాలపై హోంమంత్రి అనిత ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Down: లక్ష దిగువకు బంగారం.. ఇదీ అసలు కారణం
దీపావళి బోనస్ ఇవ్వలేదని టోల్ గేట్లు ఎత్తేసారు !! రూ. లక్షల్లో నష్టం
అరటి గెలల కోసం పోటీ.. ఏమిటి వాటికి అంత ప్రత్యేకత
