ట్విట్టర్ ప్రక్షాళన.. భారీగా ఫేక్ అకౌంట్ల తొలగింపు

Twitter Closes Thousands Of Fake News Accounts Around The World, ట్విట్టర్ ప్రక్షాళన.. భారీగా ఫేక్ అకౌంట్ల తొలగింపు

ప్రముఖ సామాజిక మాధ్యమమైన ట్విట్టర్.. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. తప్పుడు వార్తలను వ్యాపింప చేసే పలు అనుమానాస్పద అకౌంట్లను గుర్తించి వాటిని తొలగించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. పలు దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు.. పార్టీలు.. వారి వారి ప్రచారం కోసం.. నకిలీ అకౌంట్లను సృష్టించి వాటిద్వారా వార్తలను వైరల్ చేస్తున్నట్లు గుర్తించామని ఆ సంస్థ అధికారులు తెలిపారు. తొలగించిన వాటిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, చైనా, స్పెయిన్‌ దేశాలకు చెందినవే ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇటీవల హాంకాంగ్‌లో కొనసాగుతున్న నిరసన గురించి.. చైనా నుంచి తప్పుడు కథనాలను నకిలీ అకౌంట్లతో వ్యాప్తిచెందించినట్లు గుర్తించామని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాదు సౌదీకి అనుకూలంగా ఈజిప్ట్‌ నుంచి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌‌కు అనుకూలంగా ఖతార్‌, యెమెన్‌ నుంచి అదే విధంగా స్పెయిన్‌, ఈక్వెడార్‌ నుంచి ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు వార్తలను వ్యాపింపచేస్తున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన అకౌంట్లను అన్నింటిని తొలగించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

ముఖ్యంగా హాంకాంగ్‌లో కొనసాగుతున్న నిరసనపై చైనా నుంచి తప్పుడు వార్తలను ప్రచారం చేసినట్లు గుర్తించామని ఆ సంస్థ తెలిపింది. వీటికి సంబంధించి 4వేల అకౌంట్లకు పైగా తొలగించినట్లు పేర్కొంది. అంతేకాదు.. గత ఆగస్ట్‌లో కూడా హాంకాంగ్ నిరసనలపై ఆజ్యం పోస్తూ రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసిన దాదాపు 2లక్షల అకౌంట్లను కూడా డిలీట్ చేసినట్లు పేర్కొంది. కాగా, ఇటీవల మన భారత్‌కి సంబంధించిన పలు పార్టీలకు సంబంధించి ఫేక్ అకౌంట్లను గుర్తించి తొలగించిన విషయం తెలిసిందే. అయితే కేవలం ట్విట్టర్‌ మాత్రమే కాదు.. మరో ప్రముఖ సామాజిక మాధ్యమమైన ఫేస్‌బుక్ కూడా ఇదే ప్రక్షాళన చేపడుతుంది. ఇప్పటికే పలు దేశాలకు సంబంధించిన ఫేక్ అకౌంట్లను డిలీట్ చేసినట్లు కూడా తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *