‘పద్మశ్రీ’ తెచ్చిన దారిద్ర్యం.. ఓ రైతు ఆవేదన

పద్మశ్రీ అవార్డు అందాక దరిద్రం పట్టుకుందని దైతరీ నాయక్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దేశంలోనే నాలుగో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న అతను.. ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. ఆ అవార్డు తీసుకున్న తర్వాతే తనకు దరిద్రం పట్టిందని చెబుతున్నాడు. తునికాకు ఏరుతూ, మామిడి తాండ్ర అమ్ముతూ వచ్చే కొద్దిపాటి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని అంటున్నాడు. కడుపు నింపుకునేందుకు ప్రస్తుతం చీమగుడ్డు తినాల్సి వస్తోందని ఆవేదన వెళ్లగక్కుతున్నాడు.

ఒడిసాలోని కియోంఝర్ జిల్లా తాళబైతరణి గ్రామానికి చెందిన 75 సంవత్సరాల దైతరీ నాయక్ నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన రైతు. సాగునీటి వసతి లేక ఊరి రైతుల సమస్యలను తీర్చేందుకు ఒంటి చేత్తే పలుగు, పార పట్టి గోనాసికా పర్వతాల మధ్య 3 కిలోమీటర్ల వరకు కాల్వను తవ్వాడు. బైతరణీ నదీ జలాలను ఊరివైపు మళ్లించాడు. దీంతో గ్రామంలో అదనంగా మరో 100 ఎకరాలకు సాగుజలాలు అందాయి. దీంతో పద్మశ్రీ అవార్డు దైతరీ నాయక్‌ను వరించింది.

పద్మశ్రీ అవార్డు వరించక ముందు వరకు ఊరిలో అందరితో కలిసి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. అయితే అవార్డు తీసుకున్నప్పటి నుంచి అతడికి అందరూ పనులు ఇవ్వడం మానేశారు. మీకు పని ఇచ్చే స్థాయి మాది కాదంటూ అనడం మొదలు పెట్టారు. అతనికి గౌరవం దక్కుతుందని ఆనందపడాలో.. పని ఇవ్వనందుకు బాధపడాలో తెలియక నాయక్‌ మనోవేదన అనుభవించారు. ఈనేపథ్యంలోనే పద్మశ్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, దైతరీ నాయక్‌కు నచ్చజెప్పి, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తామని కియోంఝర్‌ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ ఠాక్రే మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *