పాములు పగబడతాయని.. సప్తసముద్రాల ఆవల ఉన్నా వచ్చి పగ తీర్చుకుంటాయని కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ పాములు నిజంగా పగ బడతాయా అనే విషయంపై చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి. కచ్చితంగా పగబడతాయని కొందరు వాదిస్తే.. అలాంటిదేమీ లేదని, మిగతా జంతువుల మాదిరిగా పాములు సాధారణమైనవని చెబుతుంటారు. అయితే అప్పుడప్పుడూ జరిగే ఘటనలు మాత్రం పాములు పగ బడతాయనే విషయాన్ని రుజువు చేస్తున్నాయా అనే ఆలోచన కలిగిస్తాయి. ఎందుకంటే పాము కాటు వేయడం సహజమే. తనను తాను రక్షించుకునేందుకు ఇలా చేస్తాయి. కానీ ఒకే పాము, ఒకే వ్యక్తని, ఒకే చోట ఐదు సార్లు కాటేసే సంఘటనలు విన్నప్పుడల్లా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఉత్తర ప్రదేశ్ లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కేవలం 9 రోజుల వ్యవధిలోనే ఒకే పాము ఐదు సార్లు కాటేసింది. అయితే డాక్టర్లు మాత్రం పాము కాటు లక్షణాలు కనిపించడం లేదని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా మన్‌కేఢా గ్రామంలో రజత్ చాహర్ డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 6న రాత్రి సమయంలో ఇంటి బయట అతని ఎడమ కాలిపై పాము కాటేసింది. దీంతో రజత్ భయంతో గట్టిగా కేకలు వేశాడు. వెంటనే అలర్ట్ అయిన కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి అతను బాధలో విలవిల్లాడుతూ కనిపించాడు. పాము కోసం వెతకగా కనిపించలేదు. బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించకుండా నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు.
పరిస్థితి తీవ్రత ఎక్కువగా మారడంతో ఎస్ఎన్మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. రజత్ ను పరీక్షించిన వైద్యులు పాముకాటు లక్షణాలేమీ లేవని చెప్పి ఇంటికి పంపించారు. 8 వ తేదీన వాష్ రూమ్ కు వెళ్లిన రజత్ ఎడమ కాలిపై అదే పాము మరోసారి కాటేసింది. హుటాహుటిన రజత్ కు నాటు వైద్యుల దగ్గర చికిత్స చేయించారు. ఈనెల 11న ఇంట్లో మూడోసారి, 13న బాత్రూమ్లో నాలుగోసారి, ఈ నెల 14న చెప్పులు వేసుకుంటుండగా ఐదో సారి రజత్‌ను పాము కరిచింది. అది కూడా ఎడమ కాలిపై మాత్రమే. అయితే రజత్ ను ఆస్పత్రికి తీసుకువెళ్తున్న కుటుంబసభ్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ వైద్యులు మాత్రం అలాంటి లక్షణాలేవి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
విషయం తెలుసుకున్న గ్రామస్థుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక వ్యక్తినే పాము ఐదు సార్లు ఎలా కాటేస్తుందనే విషయం తెలుసుకునేందుకు రజత్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఒకే పాము, ఒకే వ్యక్తిని, ఒకే చోట ఐదు సార్లు కాట్లు వేయడం మాత్రం నిజంగా విచిత్రమైన పరిణామమే..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..