AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

90 లక్షల ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి.. ఫ్రీగా ఇస్తున్నా ఎవరూ తీసుకోవడం లేదు! అసలు మిస్టరీ ఏంటంటే..

ప్రపంచంలోని అనేక ప్రధాన నగరాల్లో ఒక చిన్న ఇల్లు కొనడం లేదా అద్దెకు తీసుకోవడం కూడా అత్యంత కష్టంగా మారింది. కొన్ని చోట్ల అధిక అద్దెలతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, మరికొన్ని చోట్ల స్థలం కొరత ఎంతగా ఉందంటే, చిన్న గదుల్లో కూడా నలుగురు నుంచి ఐదుగురు నివసించాల్సి వస్తోంది. అయినప్పటికీ, ఒక దేశంలో లక్షలాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. అక్కడి ప్రభుత్వమే ప్రజలను ఆ ఇళ్లలో స్థిరపడమని ఆహ్వానిస్తోంది. ఆశ్చర్యకరంగా, ఉచిత గృహవసతి అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజలు ఇప్పటికీ అక్కడ నివసించడానికి ఇష్టపడటం లేదు. అక్కడ సుమారు 90 లక్షల ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి. కానీ వాటిలో ఉండటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి వింత పరిస్థితి నెలకొన్న ఆ దేశం ఏది..? దాని గురించిన ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం..

90 లక్షల ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి.. ఫ్రీగా ఇస్తున్నా ఎవరూ తీసుకోవడం లేదు! అసలు మిస్టరీ ఏంటంటే..
Japan Free Houses
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2026 | 5:32 PM

Share

ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలు చూపిస్తుంటే, జపాన్ మాత్రం ఇళ్లను ఉచితంగా ఇచ్చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, జపాన్‌లో మాత్రం ఇళ్లు అమ్ముడుపోక, నివాసం ఉండే వారు లేక లక్షలాది ఇళ్లు భూత్ బంగ్లాల్లా మారుతున్నాయి. జపాన్ ప్రభుత్వం వీటిని అకియా అని పిలుస్తుంది. జపాన్‌లో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. వృద్ధులు మరణించిన తర్వాత వారి ఇళ్లను చూసుకునే వారసులు లేకపోవడం వల్ల ఆ ఇళ్లు ఖాళీగా పడి ఉంటున్నాయి. యువత అంతా ఉపాధి, ఆధునిక జీవనశైలి కోసం పెద్ద నగరాలకు వెళ్లడం వల్ల పల్లెటూళ్లలో ఇళ్లను పట్టించుకునే వారు కరువయ్యారు.

మరోవైపు, జపాన్‌లో ‘ఒంటరి మరణాలు’ (Lonely Deaths) సంభవించిన ఇళ్లను అరిష్టంగా భావిస్తారు. అలాంటి ఇళ్లలో నివసించడానికి ఎవరూ ఇష్టపడరు. పాత ఇళ్లను కూల్చివేస్తే భూమిపై పన్ను పెరుగుతుంది. అందుకే యజమానులు ఆ ఇళ్లను అలాగే వదిలేస్తున్నారు తప్ప వేరే వారికి ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ ఖాళీ ఇళ్ల వల్ల నేరాలు పెరగడం, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అకియా బ్యాంక్ లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా చాలా తక్కువ ధరకే లేదా ఉచితంగా ఇళ్లను అందిస్తున్నారు. విదేశీయులు కూడా ఈ ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. అయితే, వాటి మరమ్మతులకు భారీగా ఖర్చు చేయాల్సి రావడం ఒక ప్రధాన అడ్డంకిగా మారింది.

Japan Free Houses

Japan Free Houses

ఈ క్రమంలోనే జపాన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల శిథిలావస్థకు చేరుతున్న గ్రామాలు మళ్లీ కళకళలాడుతాయని ఆశిస్తున్నారు. ఒకవేళ మీకు జపాన్ సంస్కృతి అంటే ఇష్టం ఉండి, అక్కడ స్థిరపడాలనుకుంటే, ఈ అకియా ఇల్లు మీకు సరిగ్గా సరిపోతాయి. ఏదిఏమైనప్పటికీ, జపాన్ ఎదుర్కొంటున్న ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాలకు ఒక హెచ్చరిక లాంటిది. జనాభా సమతుల్యత దెబ్బతింటే అది దేశ ఆర్థిక వ్యవస్థపై, మౌలిక సదుపాయాలపై ఎంతటి ప్రభావం చూపుతుందో జపాన్ అకియా ఇళ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us