
పుట్టినరోజున కేక్ కట్ చేసి కొవ్వొత్తులు ఆర్పే సంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. నేడు కేక్ కట్ చేయడం ఆనందం, ఆత్మీయత, కొత్త సంవత్సర ఆరంభానికి ప్రతీకగా మారింది. ప్రాచీన గ్రీకులు చంద్రదేవత ఆర్టెమిస్కు గుండ్రని కేకులు సమర్పించి వాటిపై కొవ్వొత్తులు వెలిగించేవారు. ఆ తర్వాత 18వ శతాబ్దం చివర్లో జర్మనీలో పిల్లల పుట్టినరోజులను కిండర్‌ఫెస్ట్ పేరుతో ఘనంగా నిర్వహించేవారు.ఉదయం కేక్‌పై కొవ్వొత్తులు వెలిగించి, సాయంత్రం వాటిని ఆర్పే ఆచారం అక్కడి నుంచే మొదలైంది. ఇంతకీ ఈ సాంప్రదాయం వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం..
చరిత్రకారుల ప్రకారం, పుట్టినరోజు కేక్ సంప్రదాయానికి మూలాలు ప్రాచీన గ్రీస్‌లో కనిపిస్తాయి. గ్రీకులు తమ చంద్రదేవత అయిన ఆర్టెమిస్కు గుండ్రని ఆకారంలో ఉన్న తీపి పదార్థాలు, కేకులు సమర్పించేవారు. వాటిపై వెలిగించే కొవ్వొత్తులు చంద్రుని కాంతిని ప్రతిబింబిస్తాయని విశ్వసించేవారు. పొగ పైకి వెళితే తమ కోరికలు, ప్రార్థనలు దేవతకు చేరుతాయని వారు నమ్మేవారు.
ఆధునిక పుట్టినరోజు కేక్ రూపానికి 18వ శతాబ్దం చివర్లో జర్మనీలో జరిగిన కిండర్‌ఫెస్ట్ వేడుకలు బలమైన పునాది వేశాయి. పిల్లల పుట్టినరోజులను ప్రత్యేకంగా జరుపుకోవడానికి ఉదయం వేళ కేక్‌పై కొవ్వొత్తులు వెలిగించేవారు. ఆ కొవ్వొత్తులు రోజంతా కరిగిపోతుండగా, సాయంత్రం వేళ వాటిని ఒక్కసారిగా ఊది ఆర్పేవారు. ఈ క్రమంలో ఒక కోరిక కోరుకునే ఆచారం క్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
పాత రోజుల్లో చక్కెర, శుద్ధి చేసిన పిండి, బేకింగ్ పదార్థాలు ఖరీదైనవిగా ఉండేవి. కాబట్టి కేక్‌లు కేవలం సంపన్నుల వేడుకలకే పరిమితమయ్యాయి. 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత బేకరీ ఉత్పత్తులు, ముడిసరుకులు సులభంగా, తక్కువ ధరకే లభించడంతో పుట్టినరోజు కేక్‌లు సాధారణ ప్రజల ఇళ్లకూ చేరాయి.
కాలక్రమేణా మతపరమైన, మూఢనమ్మకాల కోణాలు పక్కకు తప్పుకుని, కేక్ కట్ చేయడం స్నేహం, ఆనందం, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతను పంచుకునే సంతోషకరమైన వేడుకగా స్థిరపడింది.