AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోల్ బదులు బైక్‌లో డీజిల్ పోస్తే ఏం జరుగుతుంది..? ఈ తప్పులు చేస్తే ఇంజిన్ షెడ్డుకే..

బైక్ రైడర్స్ అందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే పెద్ద టెన్షన్.. పెట్రోల్ బైక్‌లో డీజిల్ పోమడం.. చాలామంది ఇలా జరగగానే ఏం చేయాలో తెలియక పదేపదే సెల్ఫ్ స్టార్ట్ కొడుతూ ఇంజన్‌ను చేతులారా పాడు చేసుకుంటారు. మరి బైక్‌లో డీజిల్ పోస్తే అది ఎందుకు స్టార్ట్ అవ్వదు? ఒకవేళ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది..? అనే విషయాలు తెలుసుకుందాం..

పెట్రోల్ బదులు బైక్‌లో డీజిల్ పోస్తే ఏం జరుగుతుంది..? ఈ తప్పులు చేస్తే ఇంజిన్ షెడ్డుకే..
What Happens If You Put Diesel In Petrol Bike
Krishna S
|

Updated on: Jun 28, 2026 | 12:39 PM

Share

గత కొన్నాళ్లుగా పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. బైక్‌లో పెట్రోల్ డీజిల్ పోస్తే ఏమవుతుంది అనేది ఆ సందేహం. అంతేకాకుండా కొన్నిసార్లు గందరగోళంలోనో లేదా పెట్రోల్ బంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లో పెట్రోల్ బైక్‌లో డీజిల్ పోయడం జరుగుతుంది. పెట్రోల్, డీజిల్ కెమికల్ రియాక్షన్స్ పూర్తిగా వేర్వేరుగా ఉండటం వల్ల.. ఇలా జరిగినప్పుడు బైక్ ఇంజిన్‌కు పెద్ద ముప్పు వాటిల్లుతుంది. ఒకవేళ పొరపాటున మీ బైక్‌లో డీజిల్ పడితే వెంటనే ఏం చేయాలి? వాహనానికి ఎలాంటి నష్టం జరుగుతుంది? మెకానిక్ షాప్‌కు తీసుకెళ్లేలోపు పాటించాల్సిన అత్యవసర జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

పెట్రోల్ బైక్‌లో డీజిల్ పోస్తే ఎందుకు స్టార్ట్ అవ్వదు?

పెట్రోల్ అనేది చాలా తేలికైన, త్వరగా ఆవిరయ్యే ఇంధనం. బైక్‌లోని చిన్న స్పార్క్ ప్లగ్ ఇచ్చే ఒక చిన్న రవ్వతో ఇది సులభంగా మండుతుంది. కానీ డీజిల్ అలా కాదు.. అది చాలా సాంద్రత కలిగిన, నూనె లాంటి ఇంధనం. డీజిల్ మండటానికి అత్యధిక వేడి, పీడనం అవసరం. పెట్రోల్ ఇంజిన్‌లోని స్పార్క్ ప్లగ్ డీజిల్‌ను మండించలేదు. ఫలితంగా బైక్ స్టార్ట్ అవ్వదు.

స్టార్ట్ చేసి ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది?

ఒకవేళ మీ బైక్ కార్బ్యురేటర్‌లో అంతకుముందే కొద్దిగా పెట్రోల్ మిగిలి ఉంటే.. బైక్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ కొన్ని మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. పెట్రోల్ అయిపోయి డీజిల్ ఇంజిన్‌లోకి రాగానే.. పెద్ద శబ్దం చేస్తూ బైక్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.డీజిల్ పూర్తిగా దహనం కాకపోవడం వల్ల సైలెన్సర్ నుండి ఘాటైన నల్లటి పొగ వస్తుంది. ఇంజిన్‌లోకి చేరిన డీజిల్ వల్ల స్పార్క్ ప్లగ్‌పై నల్లటి మొండి మసి పేరుకుపోయి, అది పూర్తిగా పనికిరానిదిగా మారుతుంది.

ఈ పరిస్థితిలో నష్టాన్ని తగ్గించుకునే స్మార్ట్ ఉపాయాలు..

బైక్ కీ ఆన్ చేయవద్దు

పొరపాటును మీరు బంక్‌లోనే గ్రహిస్తే.. అత్యంత ముఖ్యమైన రూల్ ఏంటంటే, బైక్ కీని ఆన్ చేయకూడదు. పదేపదే సెల్ఫ్ స్టార్ట్ లేదా కిక్ కొట్టకూడదు. మీరు స్టార్ట్ చేయనంత వరకు డీజిల్ కేవలం ఫ్యూయల్ ట్యాంక్‌లోనే ఉంటుంది కాబట్టి నష్టం చాలా తక్కువ.

పరిష్కారం: బైక్‌ను ఒక పక్కకు పార్క్ చేసి, దాని ప్రధాన ఫ్యూయల్ పైపును తొలగించి ట్యాంక్‌లోని డీజిల్ మొత్తాన్ని బయటకు తీసేయాలి. ఆ తర్వాత కొద్దిగా పెట్రోల్ పోసి ట్యాంక్‌ను శుభ్రంగా కడిగి, మళ్లీ తాజా పెట్రోల్‌తో నింపితే బైక్ ఎలాంటి సమస్య లేకుండా నడుస్తుంది.

వాహనం మధ్యలో ఆగిపోతే

ఒకవేళ మీరు బైక్‌ను నడిపి, అది మధ్యలో ఆగిపోతే.. డీజిల్ అప్పటికే ఇంజిన్‌లోని ఇతర భాగాలకు వ్యాపించిందని అర్థం. ఇటువంటి పరిస్థితిలో మీ సొంత ప్రయోగాలు చేయకుండా మెకానిక్‌ను సంప్రదించాలి.

పరిష్కారం: మెకానిక్ సహాయంతో ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ ఇంజెక్టర్, స్పార్క్ ప్లగ్‌తో సహా అన్ని భాగాలను విడదీయాలి. వాటన్నింటినీ పెట్రోల్‌తో క్షుణ్ణంగా క్లీన్ చేసి, మళ్లీ బిగించిన తర్వాతే వాహనాన్ని స్టార్ట్ చేయాలి.

Follow Us