పాములంటే సాధారణంగా అందరికీ భయమే. కొందరు పాము పేరు చెప్పగానే ఆమడదూరం పరుగెడతారు. అయినా హిందూ సంప్రదాయంలో పాములను దేవతగా ఆరాధిస్తారు. పాలు పోసి పూజలు చేస్తారు.అయితే పుట్టల దగ్గరో, లేక ఆలయాల్లోనో పూజలు చేస్తారు. కానీ ఓ కుటుంబం ఏకంగా ప్రమాదకరమైన నాగుపామును తీసుకొచ్చి ఇంట్లోనే పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంట్లో కొందరు పూజలు చేస్తున్నారు. అందరూ ఎంతో భక్తిగా కూర్చుని పూజలో పాల్గొన్నారు. వారంతా చేసేది ఏ సత్యనారాయణవ్రతమో కాదు.. ఏకంగా ఓ పెద్ద నాగుపామును తీసుకొచ్చి పళ్లెంలో కూర్చోబెట్టి పాలాభిషేకం చేస్తూ పూజలు చేస్తున్నారు. అదికూడా ప్రమాదకరమైన బ్లాక్ కోబ్రా.. దానిని చూస్తుంటేనే గుండెజారిపోతుంది. అలాంటిది ఆ పాము చుట్టూ అందరూ కూర్చుని అర్చకుడు మంత్రాలు చదువుండగా నాగుపాముకు పూజలు చేశారు. ఆ నాగుపాము పళ్లెంలో చుట్టూ తిరుగుతూ ఎవరిని కాటువేద్దామా అన్నట్టుగా చూస్తోంది. ఓసారి ఎవరినో కాటేయబోయింది కూడా. కానీ తప్పించుకున్నారు. అయినా ఎవ్వరూ భయపడలేదు, అక్కడినుంచి కదలనూలేదు. పూజలు కంటిన్యూ చేసారు. ఇది ఏ ప్రాంతంలో, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, వీడియో చూస్తే శివరాత్రి సందర్భంగా ఆ కుటుంబం పామును పూజించినట్లు తెలుస్తోంది. ఓంకార్ సనాతని పేరుతో ఓ నెటిజన్ ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. హిందూ సంస్కృతిలో శివుడు, నాగ దేవతకు ఉన్న ప్రాధాన్యత గురించి అందులో వివరించాడు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను ఏకంగా 3.68 లక్షలమంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అవాక్కవుతున్నారు. కొందరు ఆ ఫ్యామిలీ ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం ప్రాణం మీదకు తెచ్చే ఇలాంటి పూజలు సరికాదని విమర్శించారు. ఓ యూజర్ అయితే శివరాత్రి కాబట్టి పామును పూజించారు.. దుర్గా నవరాత్రులు అయితే పులినో లేక సింహానో కూర్చోబెట్టి పూజిస్తారా? అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..