ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు దుర్మరణం

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తున్న టయోటా కారును ఒక పోర్షే కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను 67 ఏళ్ల రమాదేవి, ఆమె 33 ఏళ్ల కోడలు బొమ్మలి నేహగా గుర్తించారు.

ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు దుర్మరణం
Vizag Woman Visiting Son In Australia Killed With Daughter In Law In Car Crash

Updated on: Sep 18, 2026 | 1:15 PM

 విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ (VDCA) మాజీ సంయుక్త కార్యదర్శి జీ టీ ప్రసాద్, తన భార్య రమాదేవితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు.  మనవడు, మనవరాలితో సమయం గడపడానికి దాంతో పాటే ఒక శుభకార్యంలో పాల్గొనేందుకు పయనమయ్యారు. కోడలు నేహ టయోటా కరోల్లా కారు నడుపుతుండగా.. వెనుక మరో కారులో ప్రసాద్‌ ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బుధవారం రాత్రి  9:40 గంటల సమయంలో.. బోర్డ్‌వాక్‌ బౌలేవార్డ్, ఇన్నిస్‌ఫెయిల్‌ డ్రైవ్‌ కూడలి మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 60 కి.మీ. వేగ పరిమితి ఉన్న ఈ ప్రాంతంలో, ఒక పోర్షే మకాన్‌ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చి.. నేహ నడుపుతున్న టయోటా కారును బలంగా ఢీకొట్టింది.  ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న నేహతో పాటు, పక్కనే కూర్చున్న రమాదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  ప్రమాదానికి కారణమైన పోర్షే కారు డ్రైవర్ కు కూడా గాయాలవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.

విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం విశాఖపట్నంలోని ఆ కుటుంబంలో, బంధువుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు కావాల్సిన అధికారిక లాంఛనాలకు మెల్‌బోర్న్‌లోని తెలుగు సంఘాలు సహకరిస్తున్నాయి. రమాదేవి కుమారుడు, నేహ భర్త అయిన వరుణ్‌ చంద్ర గున్న.. తమ వారి భౌతిక కాయాలను భారతదేశానికి రప్పించేందుకు ‘గోఫండ్‌మీ’ (GoFundMe) ద్వారా విరాళాల సేకరణ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.

సెప్టెంబర్ 16, 2026 న నేహ, రమాదేవి టయోటా కారులో ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంతో తన ప్రపంచం ఒక్క క్షణం తలకిందులైందని వరుణ్ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. “ఒకే ఒక్క విపత్కర క్షణంలో నా జీవిత భాగస్వామిని, అమ్మను కోల్పోయాను” అని  రాసుకొచ్చారు. తన 75 ఏళ్ల తండ్రి తులసి ప్రసాద్ జీవితాంతం తోడుగా ఉన్న భార్యను కోల్పోయారని, తమ ఇద్దరు పిల్లలు తల్లిని, అమ్మమ్మను కోల్పోయారని వరుణ్ తన దుఃఖాన్ని పంచుకున్నారు.

వరుణ్ తన భార్య నేహ గురించి చెప్తూ.. ఆమె తమ ఇంటికి “వెలుగు, ప్రాణం” అని కొనియాడారు. తను దయాగుణం ఉన్న వ్యక్తి అని, ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంటుందని, డాన్స్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఇటీవల స్థానిక కమ్యూనిటీతో కలిసి తమ కుమార్తె విదాన్వి తొలి పుట్టినరోజు వేడుకను తన భార్య ఎంతో ఆనందంగా జరుపుకుందని గుర్తుచేసుకున్నారు.  ఇద్దరు పిల్లలను సింగిల్ పేరంట్ గా పెంచే పెద్ద సవాలు ఇప్పుడు తన ముందు ఉందని వరుణ్ తెలిపారు. ఈ ఆర్థిక భారాన్ని తాను ఒక్కడే మోయలేనని పేర్కొంటూ.. ఈ క్లిష్ట సమయంలో తనకు సహాయం చేయాల్సిందిగా కమ్యూనిటీని, స్నేహితులను, దాతలను ఆయన అభ్యర్థించారు.

నేహ, రమాదేవి భౌతిక కాయాలను భారతదేశానికి తరలించడానికి అయ్యే రవాణా ఖర్చుల కోసం గోఫండ్ మీ నిధులను ఉపయోగిస్తారు. దీనివల్ల కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య భారత్‌లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడానికి వీలవుతుంది. అలాగే ఈ విరాళాల ద్వారా అత్యవసర ప్రయాణం, కాన్సులేట్ పత్రాల ఖర్చులు, వరుణ్ అతని 75 ఏళ్ల తండ్రికి సంబంధించిన  ఖర్చులు, పిల్లలు హారవ్, విదాన్విల అవసరాలకు ఆర్థిక భరోసా అందుతుందని భావిస్తున్నారు.

విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార ఎన్‌ఈ లేఅవుట్‌లో నివాసం ఉంటున్న  షిప్‌యార్డు రిటైర్డ్  ఉద్యోగి ప్రసాద్‌.. విశాఖపట్నం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌కు మాజీ సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం ఆయన రోడ్డు ప్రమాదంలో తన భార్య, కోడలిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన కళ్లెదుటే ఆయన భార్య రమాదేవి, కోడలు బొమ్మలి నేహ మృతి చెందారు. ఆస్ట్రేలియా నుంచి మృతదేహాలు విశాఖకు చేరుకోవడానికి సుమారు పది రోజులు పట్టే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us