రష్యాకు వెళ్తే అక్కడి ఆవుల్ని మనం వింతగా చూడక తప్పదు. మరేం లేదు.. వాటి కళ్ళకు (ముఖానికి అందామా ) వీఆర్ (వర్చ్యువల్ రియాల్టీ) హెడ్ సెట్లు కనిపించి కంగారు పడతాం.. అయితే అక్కడి రైతులకు ఇదేమీ వింత కాదట.. ఆవుల మందలో ఉండే వీటికి ఈ హెడ్ సెట్స్ ను అమరిస్తే.. వాటి ‘ యాంగ్జయిటీ ‘ , ‘ ఎమోషనల్ మూడ్ ‘ తగ్గి… పాలు ఎక్కువగా ఇస్తాయని వారు నమ్ముతున్నారు. మాస్కో సమీపంలోని క్రాస్నోగొర్క్ పాడి పరిశ్రమకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలోని రైతులు.. డెవలపర్లు, కన్సల్టెంట్లను అప్రోచ్ అయి.. ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వాతావరణ పరిస్థితులు పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, ఇలాంటి ప్రయోగాలవల్ల వాటి పాల దిగుబడి పెరుగుతుందని డచ్, స్కాటిష్ పరిశోధకుల స్టడీలో తేలిందట. రష్యా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇదే విషయాన్ని చెబుతోంది. పశువుల ‘ ఎమోషనల్ మూడ్ ‘ ని తమకు అనువుగా మార్చుకునేందుకు రైతులు రోబోటిక్స్ పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని ఈ శాఖ పేర్కొంది. అమెరికాలో వీటి మాసేజ్ కోసం ఆటోమేటెడ్ రొటేటింగ్ బ్రష్ లను వాడుతున్నారు. ఇక రష్యాలోనే మరికొందరు తమ పశుసంపద ఆరోగ్యంగా, ‘ రిలాక్స్ ‘ గా ఉండేందుకు ‘ క్లాసికల్ మ్యూజిక్ ‘ కూడా వాటికి వినిపిస్తున్నారు. మరి.. కొత్తగా చేబట్టిన ‘ వీఆర్ టెక్నాలజీ ‘ కారణంగా రష్యన్ ఆవులు ‘ క్షీర విప్లవానికి ‘ తెర తీస్తాయా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇక ఆవులకు ఈ టెక్నాలజీలో మన తెలుగు సినిమాలు చూపిస్తే పాల దిగుబడి ఇబ్బడి ముబ్బడి కావచ్చేమో!