
వీధి కుక్కలకు ఆహారం పెట్టినందుకు మహిళపై ఓ వ్యక్తి దాడి చేసిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. వీడియోలో ఆ మహిళ వీధి మధ్యలో వెనుకకు నడుస్తూ ఉండగా ఆ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. ఆమె “దీదీ, వీడియో బనావో” అని చెబుతోంది, అంటే “సోదరి, వీడియో రికార్డ్ చేయి” అని అర్థం. కొన్ని క్షణాల తర్వాత, ఆ వ్యక్తి ఆమెను మళ్ళీ చెంపదెబ్బ కొట్టాడు.
ఆ వ్యక్తి ఆ మహిళను పదే పదే చెంపదెబ్బ కొడుతున్నట్లు వీడియోలో చూపిస్తుంది, ఆమె “వీడియో బనావో” (వీడియో రికార్డ్ చేయి) అని మాత్రమే వేడుకుంటూనే ఉంది. ఒకానొక సమయంలో ఆ మహిళ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆ వ్యక్తి ఆమె రెండు చేతులను పట్టుకున్నాడు. ఆ వ్యక్తి “తుమ్నే మార హై పెహ్లే” అని చెప్పడం వినవచ్చు, అంటే “ముందు నువ్వే నన్ను కొట్టినవ్” అని అర్థం. ఆశ్చర్యకరంగా ఈ సంఘటనను జరగడాన్ని అనేక మంది ప్రేక్షకులుగా చూస్తున్నారు తప్ప ఎవరూ జోక్యం చేసుకోలేదు.
వీడియో చివర్లో, ఆ మహిళ రికార్డింగ్ చేస్తున్న వ్యక్తిని “కాల్ 100” అని కోరుతూ పోలీసు అత్యవసర నంబర్‌ను సూచిస్తుంది. ఆ వ్యక్తి “మై కర్తా హూన్ 100 నంబర్ పే” అని అనడం వినిపిస్తుంది. అంటే “నేనే 100కి కాల్ చేస్తాను” అని అర్థం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడిపై సోషల్ మీడియా జనాలు ఏకి పారేస్తున్నారు. కఠినంగా శిక్షించాలని పోస్టులు పెడుతున్నారు.
వీడియో వైరల్ కావడంతో ఘజియాబాద్ పోలీసులు స్పందించారు. దాడి చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఘజియాబాద్‌లోని బ్రహ్మపుత్ర ఎన్‌క్లేవ్‌లోని సిద్ధార్థ్ విహార్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.