నాగ్‌పూర్, ఆగస్టు 18: రీల్స్ మోజులో యువత ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఫేమస్ అయ్యేందుకో, సరదా కోసమో ఈ మధ్య కొందరు ప్రమాదకర రీతిలో స్టంట్‌లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటివి ఎన్ని సంఘటనలు జరిగినా యువతలో ఈ స్టంట్ పిచ్చి మాత్రం వదలట్లేదు. తాజాగా విహార యాత్రకు వెళ్లిన కొందరు కుర్రోళ్లు నిండు కుండలా పొంగి పొర్లుతున్న డ్యామ్‌పై ప్రమాదకర స్టంట్ చేసి మృత్యువును కోరితెచ్చుకున్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తృటిలో తప్పించుకున్నారు. ఈ భయానక ఘటన మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఉన్న లోకి కాలామ్న ప్రాంతానికి చెందిన ఆకాశ్ చకోలే (23) అనే యువకుడు స్వాతంత్ర్య దినోత్సవం రోజున స్నేహితులతో కలిసి స్థానిక పర్యటక ప్రాంతమైన మకర్‌ఢోక్డా డ్యామ్‌కు వెళ్లాడు. ఇటీవల కురిసిన వర్షాలకు డ్యామ్ నిండి అలుగు పారుతోంది. దీంతో ఈ ప్రాంతం టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్యామ్‌ను చూసేందుకు నిత్యం వందలాది మంది టూరిస్టులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి ఆకాశ్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అయితే అక్కడ వీళ్లు ప్రమాదకర స్టంట్ చేసేందుకు యత్నించారు.
ముగ్గురు స్నేహితులు నీరు పారుతున్న డ్యామ్ గోడను ఎక్కేందుకు ప్రయత్నించారు. వీరిలో ఆకాశ్ ఒక్కడే డ్యామ్ పైకి చేరుకున్నాడు. అయితే డ్యాగ్ గోడ ఎక్కిన ఆకాశ్.. ఎందరు వారించినా వినకుండా డ్యామ్ గోడపై నిటారుగా నిలబడి రెండు చేతులు ఊపుతూ డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపిస్తుంది అయితే అతడిని కిందకు తీసుకొచ్చేందుకు మిగతా ఇద్దరు స్నేహితులు గోడపై పాకుతూ అతడిని సమీపించేందుకు యత్నిస్తారు. ఈ క్రమంలో ఒకరు ఆకాశ్ కాలు పట్టుకుని కిందకు లాగేందుకు యత్నిస్తాడు. కానీ అతడు బ్యాలెన్స్ కోల్పోవడంతో పాకుతూ వెళ్తున్న ఇద్దరు స్నేహితులు జారుకుంటూ కింద పడిపోతారు. ఈ క్రమంలో డ్యామ్ వాలుపై ఉన్న ఆకాశ్ కూడా బలమైన నీటి ప్రవాహం కారణంగా క్షణాల వ్యవధిలోనే బ్యాలెన్స్ కోల్పోయి, ప్రమాదవశాత్తు అవతలవైపున్న నీటిలో పడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొన్ని గంటల తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.